ప్రభావితం చేయనున్న మహిళా ఓటర్లు
మహిళలకు విభిన పథకాల అమలు
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లదే పెద్ద పాత్ర
హైదరాబాద్,సెప్టెంబర్29(ఆర్‌ఎన్‌ఎ): ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా మహిళలకు అనేక పథకాలు అమలు జరుగుతన్నాయి. దీంతో మహిళా ఓటర్లు అధికార టిఆర్‌ఎస్‌కు మొగ్గు చూపుతారని టిఆర్‌ఎస్ నాయకత్వం ఆశభావంగా ఉంది. ప్రతి ఇంట్లో ఏదో ఒక పతకం ద్వారా మహిళలు అబ్ది పొందుతున్నారు. పెన్షన్లు, ఒంటరి మహిళకు పెన్షన్, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, అంగన్‌వాడీ ఇలా అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ఓ రకంగా ఇవన్నీ కూడా మహిళలను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్నారు. గర్భిణులు ప్రసవం కోసం దవాఖానకు వెళ్లేందుకు, ప్రసవాతనంతం ఇంటికి చేరడం కోసం ప్రభుత్వం 102 ఏర్పాటు చేసింది. ఇది తమకు ఎంతో సౌకర్యవంతంగా ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సురక్షితమైన ప్రసవాల కోసం ప్రభుత్వ దవాఖానల్లో చేరేవారికి ప్రభుత్వం కేసీఆర్ కిట్లు అందిస్తోంది. పుట్టే పిల్లల కోసం రూ. 12వేలు అందించడంతో పాటు, ఆడపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా అందిస్తున్నారు. ప్రసవం తర్వాత రూ.2వేల విలువైన 16 రకాల వస్తువులుండే కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. దారిద్‌ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన బాలింతలు, గర్భిణులకు పౌష్ఠికాహారం అందించేందుకు ఆరోగ్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టింది. తల్లీ బిడ్డలు ఆరోగ్యం ఉండేందుకు ఉద్దేశించినదే ఈ పథకం. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేద దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన యువతుల వివాహానికి రూ.1,00,116 చొప్పున అందిస్తున్నారు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు పెళ్లీడుకొచ్చిన తమ కూతురు పెళ్లిళ్ల విషయంలో దిగులు లేకుండా
ఉన్నారు. ఇకపోతే ప్రదానంగా మహిళల రక్షణకు సంబందించి షీ టీంల ద్వారా ఎక్కడా మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూశారు. దీంతో పోకిరీలు, ఇతరుల నుంచి లైంగిక వేధింపులు, ఇబ్బందులు తప్పాయి. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. మహిళలనే లబ్ధిదారులు పేర్కొంటూ పట్టాలు ఇచ్చారు. దళిత బస్తీలో భాగంగా భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పట్టాదారు పాసు పుస్తకాలు మహిళల పేరిట జారీ చేశారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్ల వేతనాలు పెద్ద ఎత్తున పెంచారు. ఇలా ఎన్నో రకాలుగా మహిళలకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. కేసీఆర్ ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి తమకు ఎంతో మేలు చేస్తున్నాడని పలువురు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వాల హయాంలో పట్టించుకోని వర్గాలను ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో మేలు చేశారని వారు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు పెద్ద అన్నగా ఉంటానని.. పెళ్లి కాని పేద యువతులకు మేనమామగా ముందుంటానని ఆయన చెప్పిన హావిూలు అన్నీ నెరవేర్చారని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.