ప్రభుత్వంపై జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు

సాగునీటి రంగంపై ప్రతిపక్ష నేతకు అవగాహన లేదు

ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు నేను సిద్ధం

నాలుగేళ్లలో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం రూ.54వేల కోట్లు ఖర్చుచేశాం

విలేకరుల సమావేశంలో ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని

విజయవాడ, జూన్‌9(జనం సాక్షి ) : సాగు నీటి రంగంపై ప్రతిపక్ష నేత జగన్‌కు ఏమాత్రం అవగాహన లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవ చేశారు. అవసరం అయితే ఆయనకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు సిద్ధమన్నారు. విజయవాడలో శనివారం ఆయన విూడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నీరు చెట్టు కింద పెద్దఎత్తున జల సంరక్షణ చర్యలు చేపట్టడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయని స్పష్టం చేశారు. ఆ ఫలాలనే వైకాపా నేతలు అనుభవిస్తున్నారన్నారు. పులిచింతల నీళ్లు ఎక్కడకు వెళ్తున్నాయో జగన్‌కు తెలియదని, రాష్ట్ర ప్రతిపక్ష నేతకు ప్రశ్నించే తత్వమే లేదని, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన వ్యక్తి రోడ్లపై తిరుగుతూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.అవినీతిలో కూరుకుపోయిన జగన్‌కు అంతా అవినీతే కనిపిస్తోందని ఉమ అన్నారు. నాలుగేళ్లలో నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం 54 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రతిపక్ష పార్టీలు ఫ్యాక్ట్‌ షీట్‌ విడుదల చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు 2 విూటర్ల మేర పెరిగాయని, రాష్ట్ర సగటు 12.80 విూటర్ల పైకి వచ్చిందని, తద్వారా రూ. 400 కోట్ల విద్యుత్‌ ఆదా అయ్యిందన్నారు. రాయలసీమలో 6 విూటర్ల మేర భూగర్బ జలాలు పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం జలాశయాల్లో 237 టీఎంసీల నీరు నిల్వ ఉందని, జూన్‌ 18 తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించి డయా ఫ్రామ్‌ వాల్‌ను జాతికి అంకితం చేస్తారన్నారు.వైకాపా మూడేళ్లుగా రాజీనామా డ్రామాలు ఆడిందని, ఇప్పటికీ వాటిని ఆమోదించు కోలేక పోయారని విమర్శించారు. ఎన్నికలు రావనే ధైర్యం తో ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.