ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చడం దుర్మార్గపు చర్య

జీవో 58 59లను వెంటనే అమలు చెయ్యాలి
–  సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ బాల మల్లేష్
జవహర్ నగర్, జనవరి 13 (జనం సాక్షి): గత కొంతకాలంగా జవహర్ నగర్లోని పలు కాలనీల్లో నిరుపేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చడం దుర్మార్గపు చర్యగా ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ బాల మల్లేష్ విరుచుకుపడ్డారు. ఆదివారం మేడ్చల్ నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ బాల మల్లేష్  జవహర్ నగర్లో కూల్చిన ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం పేదలపై చేపడుతున్న చర్యలపై ప్రసంగించారు. పేదలకు ఇళ్ళు కూల్చడం పిరికిపంద చర్యగా బాల మల్లేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన వాగ్దానాలు అమలుచేయకుండా  విచ్చలవిడిగా ఇండ్లు కూల్చుతూ ప్రజలపై ప్రతాపం చూపుతుందని మల్లేష్ తెలిపారు. ఇండ్లు కూల్చే ముందు ప్లాట్లుగా చేస్తున్న దళారులను పెట్టుకోకుండా, దాదాపు ఇరువైఐదు ఏండ్లుగా ప్లాట్లుగా అమ్ముడుకొనుడు వ్యవహారం రెవెన్యూ అధికారు లు గమనించక పోవడం విడ్డురంగా ఉందని బాల మల్లేష్ స్పష్టం చేశారు. ముప్పైఏండ్లుగా ఇక్కడి ప్రజలు తమ నివాస యోగ్యంగా ఉండి, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఇండ్లుగా కట్టుకున్న వాటిని నేలమట్టం చేయడం తగదని ప్రభుత్వ తీరుపై బాల మల్లేష్ మండిపడ్డారు. జీవో 58, 59లను ఇక్కడి ప్రజలకు వర్తిపజేయకుండా కళ్ళబొల్లి మాటలతో కాలం గడుపుతున్నారని ఆయన తెలిపారు. డబ్బులిస్తేనే లేదంటే బెదిరింపులకు పాల్పడుతూ దళారులు అధికారులు పేదల ఉసురు పోసుకుంతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ చర్యలపై, అధికారుల తీరుతో ప్రజల్లో అసహనం ఎక్కువైందని, ప్రజలపై ప్రతాపం చూపితే సహించేది లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి వెంటనే పేదలకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇండ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో  సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దశరథ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎంపీటీసీ సభ్యుడు తోటపల్లి శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కృష్ణమూర్తి, వార్డు సభ్యురాలు ఆర్ గిరిజ, కాప్రా మండల సీపీఐ కార్యదర్శి నిమ్మల నర్సింహ, జిల్లా నాయకులు సహదేవ్, జంగయ్య, జవహర్ నగర్ సీపీఐ కార్యదర్శి డీ యాదగిరి, నాయకులు కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.