ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉదృతరూపం దాల్చుతుంది
ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకుల హెచ్చరిక
రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు
హైదరాబాద్,డిసెంబర్ 22(జనంసాక్షి): రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం కోసం ప్రస్తుతం శాంతియుతంగా పోరాటం ప్రారంభించామని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉదృతరూపం దాల్చుతుందని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘాల నేతలు దేవులపల్లి అమర్, కె.శ్రీనివాస రెడ్డి, నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీలు హెచ్చరించారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, గృహాలు, మంజూరు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తునందుకు మంగళవారంనాడు సమాచార శాఖ కమీషనర్, కార్యాలయంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. శిబిరాన్ని ఉద్దేశించి వారు మట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక తమ సమస్యలు శాశ్వతంగా నిర్మూలించబడతాయని ఆశించి, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన జర్నలిస్టులకు ప్రభుత్వం నిరాశే మిగిల్చిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు విలాసవంతమైన జీవితాలు, ప్రత్యేక సౌకర్యాలు కోరుకోవడం లేదని, దశాబ్దల కాలంగా జర్నలిస్టులు పోరాడి సాధించుకున్న హక్కులు, సర్కారు ఇచ్చిన హామీల అమలు మాత్రమే తాము కోరుకుంటున్నామని, కొత్తగా ఏమీ కోరుకోవడం లేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం దీనికి స్పందించాలని వారన్నారు. గత ప్రభుత్వాలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జర్నలిస్టుల సమస్యలు, పథకాలన్నీటిని అమలు పరిచాయి. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి ఏడాదిన్నర కావస్తున్న ఇప్పటికీ జర్నలిస్టుల సమస్యలపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. ప్రస్తుతం తాము శాంతియుతంగా పోరాటానికి శ్రీకారం చుట్టామని, ప్రభుత్వం స్పందిచని పక్షంలో తమ పొరాటం ఉదృతరూపం దాల్చడం ఖాయమన్నారు. నేటి నిరాహార దీక్షకే తాము పరిమితం కాకుండా, ఈ నెల 28న తెలంగాణ వ్యాప్తంగా ప్రదర్శనలు, ధర్నాల కార్యక్రమం చేపడతామని అన్నారు. అయినా ప్రభుత్వం దిగిరాని పక్షంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా వేల మంది జర్నలిస్టులతో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామని అమర్, శ్రీనివాస్, శేఖర్, విరాహత్ అలీ స్పష్టం చేశారు. తమ సంఘం పిలుపుమేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాలో జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించిన జనంసాక్షి ఎడిటర్ ఎం.ఎం. రహమాన్ మట్లాడుతూ నిశ్శబ్దం ఆవరించినపుడు రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల నియంత్రణ పోకడలకు వ్యతిరేకంగా కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటించినపుడు మొట్టమొదట తెలంగాణ గళం విప్పింది తెలంగాణ జర్నలిస్టులేనని ఆయన గుర్తు చేశారు.ఉస్మానియా యూనివర్సీటీ కేంద్రంగా ఉద్యమం నడుస్తున్నపుడు విద్యార్థులకు వెన్నదన్నుగా నిలబడ్డారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేేసీఆర్ ప్రమాణం చేసే కొన్ని రోజుల ముందు , తాజ్‌కృష్టలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. జర్నలిస్టుల పక్షాన జరిగే ఏ పోరాటానికైన తమ సంపూర్ణ మలద్ధతు ఉంటుదన్నారు. ఈ కార్యకమంలో ప్రెస్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా మెంబర్ అమర్‌నాథ్, ఐజేయూ జాతీయ కార్యదర్శి ఎంఏ మాజీద్, కె. సత్యనారాయణ, హెచ్‌యూజే కార్యదర్శి వెలిచాల చంద్రశేఖర్, ప్రచార కార్యదర్శి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.