ప్రభుత్వాలు చట్టబద్ధంగా పనిచేయాలి

5

– మల్లన్నసాగర్‌ను రీడిజైన్‌ చేయాలి

– 15 రోజుల్లో అధ్యయన నివేదిక సమర్పిస్తాం

– టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం

హైదరాబాద్‌,జులై 14(జనంసాక్షి): అవసరాలకు అనుగుణంగా రీ డిజైన్‌ చేస్తున్నామనిచెబుతున్న ప్రభుత్వం మల్లన్న సాగర్‌ విషయంలోనూ అదే పనిచేయాలని రాజకీయ ఐకాస డిమాండ్‌ చేసింది. మల్లన్న సాగర్‌ వల్ల తక్కువ ముంపు జరిగేలా చూడాలని ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు.  నాంపల్లిలోని ఐకాస కార్యాలయంలో స్టీరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించింది. తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరామ్‌ అధ్యక్షతన వివిధ సంఘాల నేతలు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ కంతనపల్లి, తుమ్మిడిహట్టి రీడిజైన్‌ చేసినప్పుడు దీనిపైనా ఆలోచన చేయాలన్నారు. అవన్నీ ముంపును తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలే కదా అని అన్నారు. వాటికి అవసరమైన రీడిజైనింగ్‌ మిగతా వాటి విసయంలోనూ ఆచరించాలని అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాజెక్టులపై ఈ నెల 21, 22న అధ్యయనం చేస్తామని తెలిపారు. భూసేకరణలో చిక్కులు, సమస్యలపై అధ్యయనం చేశామని.. 15 రోజుల్లో నివేదిక తయారు చేయాలనే ఆలోచనతో తాము ఉన్నట్లు కోదండరామ్‌ చెప్పారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయపరమైన అంశాలపై సెమినార్‌ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చట్ట బద్దంగా ప్రాజెక్టులు నిర్మించాలని ప్రొ.కోదండరాం అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టులు నిర్మించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన విూడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు చట్టం ప్రకారం పని చేయాలని…. చట్టానికి వ్యతిరేకంగా పని చేసేందుకు వీల్లేదన్నారు. తక్కువ ముంపు ఉండే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం, నిపుణుల ఇష్ట ప్రకారం కాకుండా..  ప్రజల అభీష్టం మేరకు ప్రాజెక్టులు నిర్మించాలని తెలిపారు. ప్రజల ఇష్టాఇష్టాలు, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈనెల 21, 22 న మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పర్యటించి.. అక్కడ నిర్మించబోయే సాగునీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తామని.. స్థానికుల అభిప్రాయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.  రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని వాపోయారు. ఉద్యోగాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు.. ట్యాగ్‌ లైన్‌ తో తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. కానీ రాష్ట్రంలో ఉద్యోగ నియమాకాలు లేవని విమర్శించారు. ప్రభుత్వం నియామకాల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. నిరుద్యోగులు ఉద్యోగులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆగస్టు మొదటి వారం లోపు నిరుద్యోగంపై సదస్సు నిర్వహిస్తామన్నారు. అలాగే విద్యుత్‌ రంగంలో ఈ రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్ణయాలపై పుస్తకం ప్రజలకు ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు. కాగా కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులో వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బిజెపి సీనియర్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి ఆరోపించారు. బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వెంటనే ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించిన నాగం… ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు కుమ్మకై ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆయన విమర్శించారు. నీటిపారుదల శాఖ విడుదల చేసిన నివేదికలే అందుకు ఆధారమని నాగం తెలిపారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు విషయంలో భూనిర్వాసితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు.