ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు
కేఎన్ఎంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల బ్రోచర్, కరపత్రం విడుదల : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ. జనం సాక్షి
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో కేఎన్ఎం లో డిగ్రీ కోర్సుల్లో (దోస్త్) ప్రవేశాల బ్రోచర్, కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ప్రయివేట్ కళాశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలతో పాటు అర్హత, సుదీర్ఘ అనుభవం, అంకిత భావంతో పనిచేసే లెక్చర్లర్లు పనిచేస్తున్నారని అన్నారు. దీంతో పాటు సర్కారీ కళాశాలల్లో మౌళికవసతుల కల్పనకు సరిపడ నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంజూరు చేస్తోందన్నారు. గ్రామీణ విద్యార్థులతో పాటు పట్టణాలకు చెందిన విద్యార్థులు కూడా ప్రభుత్వ కళాశాలల వైపునకు ఆకర్షితులవుతున్నారని అన్నారు. కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ వెబ్ సైట్ ద్వారా అడ్మిషన్ పొందాలని తెలిపారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కేఎంఎం డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి…కేఎన్ఎం డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం తనవంతుగా 25వేల రూపాయల విరాళాన్ని కళాశాల ప్రిన్సిపాల్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ (ఎఫ్ఏసీ) టి. వెంకటరమణ, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, తిరుపతమ్మ, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్,పోకల రాజు, మండల రైతుబంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, యాదగిరి, సాధినేని శ్రీనివాస్, ఫయాజ్, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.