ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొరత..

-నిరుపేదలకు పెరిగిన ఆర్థిక భారం.
-భారీగా సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ మందుల దుకాణాలు.
-ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పెరిగిన రోగులు తగ్గిన మందులు సరఫరా.
మణుగూరు, ఆగష్టు 26 (జనంసాక్షి):

తెలంగాణలో మందుల కొరతతో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది ప్రభుత్వం ఔషధాలు సరఫరా చేయకపోవడంతో ప్రైవేట్ దుకాణాలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భారం పెరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలు సరఫరా చేసే సంస్థలు రెండు నెలలుగా మందులు అరకొడిగా పంపించడం వల్ల తీవ్ర కొరత ఏర్పడింది. సీజనల్ వ్యాధులు సమయములో అమేక్సీసిలిన్ ప్లస్, క్లారమ్ఇంజక్షన్లు యాంటీబయాటిక్ సిట్రోజెన్ యాంటీరెంటఫ్, మల్టీ విటమిన్స్, జలుబు సిరప్స్, పెయిన్ కిల్లర్స్, రక్త నిధి, రక్త కణాల పరీక్షల సిపిఓ సంబంధించినవి లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మణుగూరు శివలింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 20 సబ్ సెంటర్లలో 75 వేలమంది రోగులు రోజువారిగా ఆసుపత్రికి వస్తున్నారు.మణుగూరు, కరకగూడెం పినపాక అశ్వాపురం మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఔషధాల కొరత వల్ల ప్రజారోగ్య సంరక్షణ సంక్షోభంలో పడేస్తుంది.

ఔషధాల కొరత:
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం లభించినప్పటికీ
సరైన ఔషధాలు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు తగిన వైద్యం పొందలేక ఇబ్బందులు పడతున్నారు. దీని వల్ల రోగుల ఆరోగ్యం మరింత క్షీణించవచ్చు. జబ్బు తీవ్రత పెరిగి ప్రాణాపాయం జరగవచ్చును కొంతమంది రోగులకు తక్షణమే చికిత్స అవసరం ఉంటే ఔషధాలు లేకపోవడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు కలగవచ్చు.
నిరుపేదలకు ఆర్థిక భారం:
ప్రభుత్వం ఆసుపత్రిలో ఉచితంగా ఇచ్చే ఔషధాలు అందుబాటులో లేకపోతే, పేద రోగులు బహుళ ఖర్చుతో ప్రైవేటు మెడికల్ స్టోర్లలో ఔషధాలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇది వారి ఆర్థిక స్థితిని మరింత దెబ్బతీస్తుంది.ఔషధాలు లభించని పరిస్థితుల్లో పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రులలో రోగ బాధతో మనోవేదనకు గురవుతారు. దీంతో వారు ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సి రావడం, అవి కూడా ఖర్చుతో కూడుకున్నవి కావడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించాలంటే ప్రభుత్వాసుపత్రిలో ఎప్పటికప్పుడు ఔషధాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
 ఔషధాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలలో ఆసుపత్రులపై విశ్వాసం కోల్పోవడం జరుగుతుంది.
కొరవడిన పర్యవేక్షణ:
ప్రభుత్వం సరఫరా చేసే మందులు లేకపోవడం వల్ల వైద్యులు ఇతర మందులు రాయడం వల్ల  అవి బయట దుకాణాల్లో లభ్యం కావడం లేదు. సీజనల్ వ్యాధులైన టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వ్యాధులు ఉన్న రోగులు ఎక్కువగా వస్తుంటారు. వారికి ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో సమస్య జఠిలంగా మారింది. రాత్రిళ్ళు వచ్చే రోగులకు సరైన మందులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు ముందుగానే గమనించి మందులను ఏర్పాటు చేయాల్సి ఉంది. పర్యవేక్షణ కొరవడడం తో వైద్యులు మందు లేవని చేతులెత్తేశారు. వంద పడకల ఆసుపత్రులతో పాటు మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఔషధాల కొరత ఎక్కువగా ఉంది. మండల కేంద్రాలలో మందులు అడిగితే  మా వద్ద లేవని వైద్యులు చెబుతున్నారు. గట్టిగా నిలదీస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోమని చెబుతున్నారు.