ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలందరికీ అమలు చేయాలి.

ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలందరికీ అమలు చేయాలి.

-బిఆర్ఎస్ పార్టీ బడాబాబుల పార్టీ.
-బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్.

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో, జనంసాక్షి:
ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలందరికీ అమలు చేయాలని బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెల్కపల్లి మండలం దాసుపల్లి గ్రామాన్ని సందర్శించి మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందడం లేదని కేవలం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు.బిఆర్ఎస్ పార్టీ పేదల పార్టీ కాదని, బడాబాబుల పార్టీ అని స్పష్టం చేశారు.బిఆర్ఎస్ పార్టీ 10ఎండ్ల నుంచి అధికారంలో ఉన్న, పేదలకు చేసింది శూన్యం అని విమర్శించారు. పేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూం ఇండ్లు పత్తా లేవని, 3ఎకరాల భూమి జాడ లేదని, లక్ష ఉద్యోగాలు కూడా కనుమరుగు అయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు ఇవ్వకుండా, కేవలం పార్టీ కార్యకర్తలకు ఇస్తూ ప్రభుత్వ పథకాల ఉద్దేశాన్ని నిరుగారుస్తూన్నారని ఆరోపించారు. అట్లాగే కొన్ని పథకాలు ఉదాహరణకు బీసి బంధు, మైనారిటీ బంధు, దళిత బంధు కేవలం ఇద్దరూ, ముగ్గురికి మాత్రమే ఇస్తూ కార్పొరేట్ కాలేజ్ ల్లాగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలందరికి పార్టీలకు అతీతంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో పేదల పక్షాన బిఎస్పీ పార్టీ పోరాడుతుందని అన్నారు.అనంతరం గ్రామంలోని మహిళలతో కలిసి పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ అంతటి నాగన్న, జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్, అసెంబ్లీ ఇంచార్జ్ మోహన్ రెడ్డి, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్, మండల అధ్యక్షులు ఆర్. శివ శంకర్, మండల ప్రధాన కార్యదర్శి బాల నాగులు, నాయకులు రాజేష్, మధు లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.