ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థుల ప్రగతికి మెట్లు: కవేలి అశోక్
జహీరాబాద్ అక్టోబర్ 15 (జనం సాక్షి)పాఠశాలలోనే విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అందువల్ల విద్యార్థులకు బాల్యంలోనే సరియైన విద్యను అందించాల్సిన బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందని ఖానాపూర్ గ్రామ పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ కవేలి అశోక్ అభిప్రాయపడ్డారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన ప్రభుత్వ పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యను ఉపాధ్యాయులు అందిస్తారని,అందువల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని అన్నారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంకోసం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్,ఉపాధ్యాయులు అమర్నాథ్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు మరియు ఖానాపూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.