ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): నాణ్యమైన విద్య , బోధన కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమని తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ – 2లో జరిగిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి రాష్ట్రస్థాయి పరిశీలకులుగా ఆయన హాజరై మాట్లాడారు.ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యాలు, ప్రవర్తన , విలువలు తదితర అంశాల్లో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఉపాధ్యాయులతో సత్సంబంధాలను కలిగి, పిల్లల సామర్థ్యాలపై నిరంతరం చర్చిస్తూ ఉండాలన్నారు.అనంతరం సెక్టోరియల్ ఆఫీసర్ ఎర్రంశెట్టి రాంబాబు మాట్లాడుతూ నిర్ణీత ప్రణాళిక ప్రకారం ఈ సమావేశాలను నిర్వహిస్తూ, పాఠశాలలను ప్రగతిపథం వైపు నడిపించాలన్నారు.అంతకుముందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంకతి వెంకన్న మాట్లాడుతూ విద్యా ప్రమాణాల మెరుగులో, విద్యార్థుల ఉన్నతిలో పాఠశాల యాజమాన్య కమిటీ, తల్లిదండ్రులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతి, హాజరు విషయంలో వ్యక్తిగత శ్రద్ధ , బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.