ప్రభుత్వ బ్యాంకుల్లో 49% ఎఫ్‌డీఐలు!

66

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్‌బి)లను విదేశీల పరం చేయడానికి మోడీ సర్కార్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పీఎస్‌బీల్లో 49 శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పించడానికి వీలుగా ఆర్థిక మంత్రిత్వశాఖ బడ్జెట్‌-2016లో ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రంగంలోని బ్యాంకుల్లో ప్రస్తుతమున్న 20 శాతం ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి చేర్చనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు మోడీ ప్రభుత్వం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం చట్టంలో మార్పులు తేనుంది. గతేడాది ప్రయివేటు రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డిఐల పరిమితిని కేంద్ర ప్రభుత్వం సడలించింది. ప్రయివేటు బ్యాంకుల్లో 74 శాతం వాటాను ఎఫ్‌ఐఐ, క్యూఎఫ్‌ఐల ద్వారా విదేశీ సంస్థలకు అనుమతించింది. ఇంతక్రితం ఈ వాటా 49 శాతంగా ఉంది. పీఎస్‌బీల్లో ఎఫ్‌డీఐల పరిమితిని పెంచడం ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. రానున్న నాలుగేళ్లలో పీఎస్‌బీలకు ఇంద్రదనస్సు పథకంలో భాగంగా రూ.70,000 కోట్ల మూలధనం సమకూర్చాలని గతేడాది కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.25వేల కోట్లు, 2017-18, 2018-19లో రూ.10,000 కోట్ల చొప్పున మూలధనం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015-16లో ఇప్పటి వరకు 13 పీఎస్‌బీలకు రూ.20,088 కోట్ల మూలధనం అందించింది.