ప్రమాదవశాత్తు గొర్రెల మృత్యువాత

నిజామాబాద్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి)
: నిజామాబాద్‌ జిల్లాలో మేతకు వెళ్లిన 105 మేకలు, గొర్రెలు ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డాయి. తాడ్వాయి మండలం, తనకల్లుకు చెందిన కొమరయ్య, మల్లయ్య, చిన్న నారాయణ, పెద్ద నారాయణ ఇలా ఓ పన్నెండు మంది తమ మేకలను మేత కోసం గురువారం నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి వెళుతుండగా… ఎల్లారెడ్డి మండలం జంకంపల్లి వద్ద చెరువు కట్టపై నుంచి మేకలు, గొర్రెలు జారి లోతైన ప్రదేశంలో పడిపోయాయి. ప్రమాదంలో సుమారు 105 వరకు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. అయితే, మేతకు తీసుకొచ్చినవి ఎక్కువ సంఖ్యలో ఉండడంతో కొన్ని జారిపడిపోయిన విషయాన్ని వాటి యజమానులు గమనించలేదు. శుక్రవారం ఉదయం కొన్ని తగ్గినట్టు గుర్తించి వెనక్కి వెళ్లి చూడగా… చెరువు గట్టు పక్కన మృతి చెంది ఉండడం కనిపించింది. దీంతో కాపరులు కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు ఐదారు లక్షల నష్టం వాటిల్లిందని ఆందోళనచెందారు.