ప్రముఖ కాంట్రాక్టర్ సంకినేని కృష్ణారావుకు సన్మానం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): దేశం సుభిక్షంగా ఉండాలంటే పాడిపంటలు కలకలలాడాలంటే అందులో ఇంజనీర్ల పాత్ర ఎంతో ఉందని మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి అన్నారు.ది ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇంజనీర్స్ , తెలంగాణ స్టేట్ సెంటర్ వారు హైదరాబాదులోని విశ్వేశ్వరయ్య భవన్ లో నిర్వహించిన వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్స్ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. భారీ కట్టడాలు నిర్మించడంలో ఇంజనీర్ల పాత్ర చాలా కీలకమని, ఒక నీటిపారుదలే కాకుండా రోడ్లు, ప్రాజెక్టులు , వంతెనల నిర్మాణంలో ఇంజనీర్ల సునిశిత విజ్ఞానానికి ప్రజలందరూ నీరజనాలు అందించాలని అన్నారు.ఈ సందర్భంగా గుర్రం వెంకట్ రెడ్డి స్మారక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసుకొని పలువురు ఇంజనీర్లను అలాగే ప్రముఖ కాంట్రాక్టర్ సంకినేని కృష్ణారావుని సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.అనంతరం సంకినేని కృష్ణారావు మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఇంజనీర్లు పట్టుకొమ్మ లాంటి వారని, ఇంజనీర్లకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ తద్వారా పలు పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో అలుపెరగని సేవలందిస్తున్న కాంట్రాక్టర్లకు సమాజంలో తగినంత గుర్తింపు గౌరవం లభించడం లేదని, ఇది విచారించదగ్గ విషయమన్నారు.లక్షలాది మంది కార్మికులకు దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ సంస్థలు జీవనోపాధి కల్పిస్తున్నాయని, ఒక్కోసారి ప్రభుత్వ బిల్లులు ఆలస్యమైన కార్మికుల సంక్షేమ, బ్రతుకుతెరువు గురించి ఆలోచించి సొంతంగా అప్పులు చేసి వారిని ఆదుకుంటున్నామని అన్నారు.ముందుగా పెట్టుబడులు పెట్టి సరైన సమయానికి పనులు చేస్తున్నామని తెలిపారు .తనను సన్మానించినందుకు కాంట్రాక్టర్స్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.