ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ: డిఎస్పీ

మెదక్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగడానికి జిల్లా పోలీస్‌ పటిష్టమైన చర్యలు చేపడుతుందని మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రమైన మెదక్‌ పట్టణంలోని రాందాస్‌ చౌరస్తా నుండి ఫతేనగర్‌, పిట్లంబేస్‌, మార్కెట్‌ చౌరస్తా, అరబ్‌గల్లీ, పిల్‌దిద్ది, అజంపుర, కొలిగడ్డ, పట్టణంలోని పలు వీధులలో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, స్థానిక పోలీస్‌ సిబ్బంది కలిసి పోలీస్‌ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజలకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు, శాంతిభద్రతల దృష్ట్యా ప్రజలకు మేమున్నామని భరోసా, భద్రత కల్పిస్తూ జిల్లా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల్లో

పాల్గొనే విధంగా ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఉండేందుకు జిల్లా ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉన్నారనే భరోసా కలిగించుట కోసం పోలీస్‌ కవాతు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేలా పటిష్ట రక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పోలీస్‌ కవాతులో పట్టణ సీఐ వెంకటేశ్‌, అల్లాదుర్గం సీఐ రవిందర్‌రెడ్డి, ఆర్‌పీఎఫ్‌ డీఎస్పీ ఏసీ మిర్జా, ఎస్‌ఐలు, సుమారు 150 మంది ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, 50 మంది పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.