ప్రాజెక్టులను అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ ఖాళీఖాయం
– తెరాస పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
– వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నిజామాబాద్, అక్టోబర్24(జనంసాక్షి) : తెలంగాణాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు, ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుందని, కానీ ప్రతిపక్ష పార్టీల నేతలు వాటిని అడ్డుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేయటం సిగ్గుచేటని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను ప్రజలు చీదరించుకుంటారని తద్వారా కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావటం ఖాయమని అభివర్ణించారు. నిజామాబాద్ రుద్రూరు మండలంలో మంగళవారం మంత్రి పర్యటించారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాణపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎస్‌కే మహ్మద్, తన కార్యకర్తలతో మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంటే కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికే 60 శాతానికి పైగా ఖాళీ అయిన ఆ పార్టీ పూర్తిగా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వస్తుందని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ప్రాజెక్టులకు అడ్డుపడకుండా ప్రజల బాగుకోసం ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రఐతులను రాజులుగా చూడటమే కేసీఆర్ ధ్యేయమని, ఆ మేరకు కసరత్తు జరుగుతుందన్నారు. ఇప్పటికే రైతుల పంటలకు మద్ధతు ధర కల్పించేందుకు రైతు సమితులను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గ్రామాల్లో భూతగాదాలు లేకుండా ఉండేందుకు భూ ప్రక్షాళన కార్యక్రమంతో గ్రామాల్లో రైతులు ఐక్యతతో ముందుకు సాగేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీనికితోడు వచ్చే ఖరీఫ్ నుంచి పెట్టుబడి కింద ఎకరానికి రూ. 4వేలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. గతంలో రైతులకు ఎరువులు, విత్తనాలు కావాలంటే కార్యాలయాల చుట్టూ, రోడ్లపై క్యూలైన్‌లలో నిలబడాల్సి వచ్చేదని తెలంగాణ ప్రభుత్వం హయాంలో ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇవన్నీ తెలిసి కూడా ప్రతిపక్షాలు రాజకీయం కోసం పాకులాడుతున్నాయన్నారు. రాజకీయం కోసం పాకులాడకుండా అభివృద్ధిలో కలిసిరావాలని మంత్రి పోచారం పిలుపునిచ్చారు.