ప్రాజెక్టులు కట్టితీరుతాం
– మహబూబ్‌నగర్‌ను సస్యశ్యామలం చేసి తీరుతాం
హైదరాబాద్,జులై 3(జనంసాక్షి): ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టులు ఆగవని మంత్రి హరీష్ రావు ఆదివారం నాడు అన్నారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాలోని మురారిదొడ్డి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఆగదని స్పష్టం చేశారు.తెరాస ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందిచేందుకు కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. పాలమూరు ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలమవుతుందని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు ప్రాజెక్టులను ఈ ఖరీఫ్ సీజన్‌లోగా పూర్తి చేస్తామన్నారు.ఈ నాలుగు ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.3,600 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. హరీష్ రావు మురారి దొడ్డి గ్రామంలో ఉన్న లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.2.30 కోట్లు కేటాయించారు.తమ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిచేందుకు కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుతగులుతున్నాయని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు కట్టి తీరుతామన్నారు. ఏ ప్రాజెక్టు కట్టినా ముంపు సర్వసాధారణమేనన్నారు. అవేవి తెలియనట్టు ప్రతిపక్షాలు గుడ్డిగా వ్యవహరిస్తున్నాయన్నారు. రాష్ట్రం విడిపోయినపుడు హైకోర్టు విభజన కూడా జరగాల్సిందేనన్నారు. ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు వ్యక్తుల కోసం కాదని, పరిపాలన సౌలభ్యం కోసమన్నారు.