ప్రాజెక్టుల డిజైన్‌ మార్చొద్దు

4

– వివాదాలు సృష్టించొద్దు

– పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

గోదావరిఖని, ఆగస్టు 30, (జనంసాక్షి) :

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన తెలంగాణాలో ప్రజాహితంకు వ్యతిరేకత జరిగితే తమ పార్టీ సహించదని.. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటి (టీపీసీసీ) అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సింగరేణి ఆర్‌జీ-1 కమ్యూనిటీహాల్‌లో జరిగిన ఐఎన్‌టియుసి ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరుకావడానికి ఇక్కడికి వచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్థానిక మార్కండేయకాలనీలోని కాంగ్రెస్‌ నాయకులు కోలేటి దామోదర్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ నినాదంతో అధికారాన్ని పొందిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగల్బాలకే పరిమితమవుతున్నారన్నారు. ప్రజాహితంకు వ్యతిరేకంగా పాలన నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రజాహితంకు వ్యతిరేకంగా కేసీఆర్‌ పరిపాలన చేస్తే… కాంగ్రెస్‌ పార్టీ సహించదన్నారు. ప్రజాహితం కోసం నిరంతర పోరాటం సాగిస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ పార్టీ బాధ్యతలు విస్మరించదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వ్యక్తిపరిపాలన, కుటుంబ పాలన జరగడం ఆక్షేపణీయమన్నారు. గుడుంబాను అరికడుదామనే నెపంతో తెలంగాణలో చీప్‌ లిక్కర్‌ను ప్రవేశపెట్టడం సహించరానిదన్నారు. ఈ చీప్‌ లిక్కర్‌ను తెలంగాణలో ప్రవేశపెడితే ప్రజలు అనారోగ్యానికి గురికావడమేకాకుండా నేరాలు పెరుగుతాయన్నారు. కిందిస్థాయిలో లిక్కర్‌ మాఫీయా పెట్రేగిపోతుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన నిర్మాణాలు, ప్రణాళికలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ ప్రభుత్వానివిగా ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో ఈ చేతగాని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌పై నిందలు మోపడం సరికాదన్నారు. 16లక్షల ఎకరాల ఆయకట్టులో సాగునీరు అందించడానికి నిపుణుల సలహాలతో ప్రాజెక్టులను పూర్తిచేయాలే తప్ప… టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజకీయం చేయోద్దన్నారు. తెలంగాణ బిల్లులో ఉన్న చట్టబద్దత విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెనుకడుగు వేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి జి.వినోద్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కె.మృత్యుంజయం, నాయకులు కోలేటి దామోదర్‌, హర్కర వేణుగోపాల్‌రావు, మహాంకాళి స్వామి, ఎం.రవికుమార్‌, కోట రవి, బొంతల రాజేష్‌, కాల్వ లింగస్వామి, గంట సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.