ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వద్దు
– ఆల్మట్టి నీరు మహబూబ్‌నగర్ ప్రాజక్టులకు అందిస్తాం
– మంత్రి హరీశ్
హైదరాబాద్,జులై 17(జనంసాక్షి):పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై టీఆర్‌ఎస్ సర్కారు దృష్టిసారించింది. పలు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరిందించేందుకు కృతనిశ్చయంతో ఉంది. ప్రత్యేకించి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు ఎప్పటికప్పుడూ ప్రాజెక్టుల పురగోతిపై దృష్టిసారిస్తున్నారు. సచివాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన?పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ప్యాకేజీల వారిగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ ల నుంచి కృష్ణా జలాలు ఏ క్షణానైనా జూరాలకు చేరుకునే అవకాశముందన్నారు మంత్రి హరీష్రావు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్ సాగర్ నుంచి ఈ సీజన్ లో నీళ్లిచ్చి తీరాల్సిందేనన్నారు. పాలమూరు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు తమ ప్రభుత్వ టాప్ ప్రియార్టీ అని ఆయన స్పష్టంచేశారు. టార్గెట్ ప్రకారం పనులు పూర్తిచేయకపోతే 146 జీవో ప్రకారం 60 శాతం బిల్లుల చెల్లింపులను నిలిపివేస్తామని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అలక్ష్యాన్ని సహించేది లేదన్నారు.ఈసారి కృష్ణా జలాలతో రిజర్వాయర్లు నిండనున్నందున? ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఆటో రిక్షాలు ,ఇతర మార్గాలలో ప్రచారం చేయాలని మహబూబ్ నగర్ జాయింట్ కలెక్టర్ ను మంత్రి హరీష్రావు ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీలు,ఫీల్డ్ చానల్స్ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని , కాలువలలో ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి బాటిల్ నెక్ సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే, పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు.