ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయండి

3

– కృష్ణా ట్రిబ్యునల్‌కు తెలంగాణ వినతి

న్యూఢిల్లీ,జులై 9(జనంసాక్షి):కృష్ణా జలాల పంపకంపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు వాదనలు ముగిశాయి. శుక్రవారం, శనివారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాగా  వాదనలు ముగిసిన అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 16కు ట్రైబ్యునల్‌ వాయిదా వేశారు. ఆగస్టు 16, 17, 18 తేదీల్లో మరోసారి ట్రైబ్యునల్‌ వాదనలను విననుంది. రాష్ట్రం తరపున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌, ఏపీ తరపున న్యాయవాది ఏకే గంగూలీ వారివారి వాదనలు వినిపించారు. కాగా కేవలం రెండు రాష్ట్రాల మధ్యే నీటి పంపకాలకు ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయలేదని వైద్యనాథన్‌ పేర్కొన్నారు. మొత్తం నదీ జలాలు పంపకం చేసేందుకే ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశారన్నారు.  మొత్తం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపాలని కోరగా, ఏపీ, తెలంగాణ మధ్యే నీటి కేటాయింపులు జరపాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. ఏపీ, తెలంగాణ మధ్య పునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు ఎందుకు చేయకూడదని ట్రైబ్యునల్‌ ప్రశ్నించినట్లు సమాచారం. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల జల జగడం ఇప్పట్లో పోయేలా లేదు. ట్రైబ్యునల్‌ తీర్పు ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.