ప్రాణం ఖరీదు పైసలేనా ?

ఓ మనిషి మరో మనిషిని చంపితే ఏం చేస్తారు ? అరెస్టు చేస్తారు. కోర్టులో ప్రవేశపెడతారు. తీర్పు చెబుతారు. శిక్ష వేస్తారు. ఇది ఒక మనిషిని చంపితే, మరి ఒక మనిషి పదుల సంఖ్యలో సాటి మనుషులను చంపితే ఏం చేస్తారు ? పైన చెప్పినవన్నీ చేస్తారు. వాటితోపాటు శిక్ష కఠినంగా ఉండాలని సిఫార్సు చేస్తారు. ఆ నరహంతకుడికి ఉరి శిక్షే సరైదని భావిస్తారు. లేదా కనీసం యావజ్జీవ శిక్షైనా పడాలని కోరుకుంటారు. ఇదంతా సమాజంలో నివసించే ఓ సామాన్యుడు నేరం చేస్తే జరిగే తంతు. కానీ, ఆ నేరస్థుడు సామాన్యుడు కాకుండా ఏ అధికారో అయితే.. అందులోనూ కీలక స్థానంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారైతే.. పని చేసిన ప్రతిచోటా రక్తపిపాసిలా నెత్తుటేరులు పారిస్తే.. అతన్ని ఏం చేస్తారు ? ఏం చేస్తారు.. ఏమీ చేయక, అది విధి నిర్వహణలో భాగమేనని నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా వదిలేస్తారు. ఇది నిజం. అక్షరాల నిజం. ఆ పోలీసు ఉన్నతాధికారి ఉన్నది ఏ బీహారో, జార్ఖండో, ఛత్తీస్‌గఢ్‌లోనో మన ఆంధ్రప్రదేశ్‌లోనే. ఆయనే సీతారామాంజనేయులు. వివాదాస్పద పోలీసు అధికారి. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న ఉస్మానియా విద్యార్థులపై రౌడీయిజం చేయడం మొదలు, విజయవాడ కమిషనర్‌గా శాంతి భద్రతలను పట్టింకోకుండా ఈవ్‌టీజింగ్‌ చేయడం వరకు ఎన్నో ఆకృత్యాలకు పాల్పడి, వేటుకు గురైన ఖాకీ బాస్‌ అతడు. అతడి సర్వీసులో మరో చీకటి కోణం ఇప్పుడు బహిర్గతమైంది. 2000 నుంచి 2002 మధ్య కాలంలో అతడు సాగించిన మారణకాండ వెలుగుజూసింది. ఆ సమయంలో గుంటూరు, కర్నూలు జిల్లాలో ఎస్పీగా పని చేసిన అతడు ‘ఎన్‌కౌంటర్ల’ పేరుతో సాగించిన నరమేధం పాపాలు ప్రస్తుతం అతడి మెడకే చుట్టుకున్నాయి. చేసిన పాపం చేతులు కడుక్కుంటే పోతుందా ? జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తన చేతికి చిక్కిన సీతారాంమాంజనేయులు ‘నేర చరిత’పై దృష్టి సారించింది. అతను చేసిన 19 ఎన్‌కౌంటర్లు కూడా బూటకమేనని గుంటూరు చెందిన న్యాయవాది, మానవ హక్కుల వేదిక నాయకుడు బి.చంద్రశేఖర్‌ 2002 జూలై 11న జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీతారామాంజనేయులు లిఖించిన రక్త చరిత్ర వాస్తవాలు బయటపడ్డాయి. ఈ కేసుపై పోయినేడాది నవంబర్‌లో కమిషన్‌ విచారణ పూర్తి చేసింది. 19 ఎన్‌కౌంటర్లలో 16 బూటకమేనని తేల్చింది. అందులో 10 కేసులు కర్నూలు జిల్లాకు చెందినవి కాగా, 6 గుంటూరు జిల్లావి. ఈ వ్యవహారంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఎన్‌కౌంటర్లు బూటకం కాబట్టి బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున మొత్తం 16 కుటుంబాలకు 80 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఇంత పెద్ద ఎత్తున పోలీస్‌ శాఖ తప్పిదం కారణంగా పరిహారం చెల్లించడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి. కానీ, ఇలా పరిహారం చెల్లింపు వల్ల బాధితులకు పూర్తి న్యాయం జరినట్లు కాదు. ఎందుకంటే, పోయింది ఆస్తి కాదు సంపాదించుకోవడానికి. ఆరోగ్యం కాదు చికిత్స చేయించుకుని బాగుపడడానికి. పోయినవి ప్రాణాలు. అదీ ఓ అధికారి పైశాచిక దర్పానికి. సీతారామాంజనేయులుపై విచారణ జరిపించి, కఠిన శిక్ష పడేలా చేస్తేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరిగినట్లు. ఒకవేళ ఇతడు సాగించిన ఆకృత్యాలకు పరిహారమిచ్చి చేతులు దులుపుకుంటే, మరో ‘సీతారామాంజనేయులు’ పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా ప్రాణాల వెల పైసలతో లెక్క కట్టలేం. అతడి వికృత తాండవానికి బాధితులు కార్చిన కన్నీటికి న్యాయం జరగాలంటే, చేసిన అపరాధానికి అతను కూడా న్యాయపర శిక్షను అనుభవిస్తూ రక్త కన్నీళ్లు కార్చాలి.