ప్రాణాలు తీసిన యూరియా!
– యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు మృతి
– సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో విషాద ఘటన
– రాష్ట్ర వ్యాప్తంగా యూరికొరతతో రైతులకు తప్పని ఇబ్బందులు
– తెల్లవారు జామునుంచే సొసైటీల వద్దపడిగాపులు
– ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న ప్రతిపక్షాలు
సిద్ధిపేట, సెప్టెంబర్5 (జనం సాక్షి ): రాష్ట్ర రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో పంటల్లో చల్లించేందుకు రైతులు యూరియాకోసం నానా తంటాలు పడుతున్నారు. సరియైన సమయంలో సరిపడా యూరియా ఉత్పీత్తులను ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవటంతో రైతులు సొసైటీలు, దుకాణాల వద్ద బారులు తీరి మరి యూరియా బస్తాలను తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం విషాదం చోటు చేసుకుంది. యూరియా కోసం క్యూలో నిలబడిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు ఎల్లయ్య (65) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఎల్లయ్యను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎల్లయ్య మృతి చెందాడు. మృతుడు ఎల్లయ్య దుబ్బాక మండలం అచ్చుమాయపల్లి వాసి. రెండు రోజులుగా ఎల్లయ్య క్యూలోనే నిలబడ్డాడని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. యూరియా కోసం అన్నదాతలు పడుతున్న కష్టానికి అద్దం పట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెల్లవారు జాము నుంచే బారులు..
పదిరోజులవుతున్నా రాష్ట్రంలో యూరియా కొరత అన్నదాతను వేదిస్తూనే ఉంది. యూరియా బస్తాలను దక్కించుకొనేందుకు రైతులు తెల్లవారు జాము నుంచే సహకార సంఘాల కార్యాలయాల ఎదుట బారులు తీరుతున్నారు. కామారెడ్డి జిల్లా సొసైటీ వద్ద యూరికోసం గురువారం తెల్లవారు జాము నుంచే రైతులు బారులు తీరారు. అయినా యూరియా దొరక్క పోవటంతో ఆందోళనకు దిగారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా భూపాల్‌లో రైతులు ధర్నా చేశారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం సొసైటీ వద్ద ఉదయం 6గంటల నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు. పాస్ పుస్తకాలతో క్యూకట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాలు పడుతుండటంతో పంటలకు యూరియా ఎంతో మేలు చేస్తుందని, ఈ సమయంలో ప్రభుత్వం యూరియా కొరతను తీర్చకపోతే పంటలు దిగుబడులు తగ్గుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పది రోజులుగా పలు ప్రాంతాల్లో యూరియా కొరతతో క్యూ లైన్ లో నిల్చుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. యూరియా నిల్వలు లేక.. అందరికీ అందడం లేదు. దీంతో ఎరువుల దుకుణాల దగ్గర వాగ్వాదాలు, ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం రాష్ట్రంలో యూరియా కొరత లేదని అంటున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. అందరికి యూరియా అందేలా చూస్తామన్నారు. నౌకల ద్వారా యూరియా రావడంలో ఆలస్యమైందని, అందుకే కొంత అసౌకర్యం కలిగిందని వివరించారు. సెప్టెంబర్ 10 వరకు నిల్వలన్నీ నిర్దేశిత ప్రాంతాలకు చేరేలా చూడాలని కంపెనీలను ఆదేశించామని అధికారులు తెలిపారు. యూరియా సమస్య రాజకీయ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. యూరియా కొరతకు కేసీఆర్ ప్రభుత్వమే కారణం అంటున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, రైతులు జీవితాలతో చెలగాటం ఆడిందని ఆరోపించాయి. అధికార పక్షం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం అని అధికార పార్టీ నేతలు ఎదురు దాడికిదిగుతుంది.


