ప్రైవేట్ వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు
రైతులకు కుచ్చు టోపీ పెడుతున్న వైనం
వరంగల్,ఫిబ్రవరి7(జనంసాక్షి): కంది రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎఫ్‌సీఐని రంగంలోకి దింపి మార్క్‌ఫెడ్ ద్వారా కందుల కొనుగోళ్లను చేపట్టింది. అయితే వ్యాపారులతో చేతులు కలపడంతో అన్నదాత మోసానికి గురవుతున్నాడు. రైతులకు వ్యాపారులకు మధ్య సమన్వయకర్తలుగా ఉండాల్సిన అధికారులే వ్యాపారులతో కలిసిపోయారు. దీంతో రైతులకు కనీస మద్దతు దొరకడం లేదు. ఏటా ఇదే తంతు జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. మార్కెట్ కమిటీ సభ్యులే చూసీచూడనట్లుగా ఉంటున్నారు. తేమ ఉందనే సాకుతో రైతుల నుంచి సరకు కొనుగోలు చేయకుండా మార్క్‌ఫెడ్ అధికారులు తిరస్కరిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యాపారులు అడిగిన ధరకు ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు మార్కెట్‌కు తీసుకుని వచ్చే సరకులో తేమ ఉందని కందులను కొనుగోలు చేయడానికి మార్క్‌ఫెడ్ అధికారులు తిరస్కరించడం, వాటిని తక్కువ ధరలకు ప్రైవేటు వ్యాపారికి విక్రయించడం షరా మామూలు అయ్యింది. చాలా సందర్భాల్లో నాణ్యత లేదనే సాకుగా చూపించి మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేయకుండా వదిలేస్తున్నారు. దీంతో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ప్రైవేటు వ్యాపారులతో కలిసిపోయిన అధికారులు వ్యాపారుల వైపే మొగ్గుచూపు తున్నారు. నాణ్యత లేదనే సాకుతో రైతులు తీసుకొచ్చిన కందులను కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. 12శాతం వరకు తేమ ఉన్న కందులను ప్రభుత్వ రంగ సంస్థనే కొనవచ్చు. కానీ.. తేమ అంతకు మించి ఉందని కొనకుండా రైతులు ప్రైవేటు వ్యాపారులవైపు వెళ్లేలా చేస్తున్నారు. అధికారులు సైతం దళారులుగా మారిపోయారు. ప్రైవేటు వ్యాపారులకే అన్నీ అప్పగించేసి చేతులు దులుపుకొన్నారు. దీంతో కాంటా నుంచి ధర నిర్ణయించడం వంటివి కూడా ప్రైవేటు వ్యక్తులే చేస్తున్నారు. చిన్నసన్నకారు రైతులు తీసుకొచ్చిన కందులను మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేయడంలేదు. తేమ ఎక్కువగా ఉందని తిరస్కరించిన కందులను ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇవే కందులను గుట్టుచప్పుడు కాకుండా మార్క్‌ఫెడ్ అధికారులకు విక్రయిస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లన్నీ రాత్రివేళల్లో జరుగుతున్నట్లు తెలిసింది. ఇలా చేసిన కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలన్నీ సమకూర్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మార్కెట్‌లో విక్రయించిన సరకులకు తప్పనిసరిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో తక్‌పట్టీ ఇవ్వాలి. అసలైన తక్‌పట్టీ రైతుకు ఇచ్చి మిగిలిన రెండు నకలును ఒకటి వ్యాపారి, మరొకటి మార్కెట్ అధికారుల వద్ద ఉంచుతారు. దీని వల్ల మార్కెట్‌కు రావాల్సిన పన్ను సమకూరడమేకాకుండా.. అక్రమాలకు అవకాశం ఉండదు. కానీ..ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసిన సరకుకు తక్‌పట్టీలను ఇవ్వడంలేదు. వ్యాపారులే తెల్లకాగితంపైన రాసిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతులను తూకంలో కూడా మోసం చేస్తున్నారు. ఎరువుల ఖాళీ సంచుల్లో తీసుకొచ్చిన కందులకు కూడా కిలో తరుగు తీస్తున్నారు. వాస్తవానికి ఇటువంటి సంచి బరువు 150గ్రాముల నుంచి 200 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. కానీ.. అటువంటి సంచిలో 10కిలోలు తీసుకొచ్చినా కిలో తరుగుతీయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ హమాలీ దందా కూడా ఎక్కువే ఉంది. ప్రతి రైతు వద్ద క్వింటాల్‌కు రెండు కిలోల చొప్పున తీసుకుంటున్నారు. వీటిపైన రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారుల దగ్గర రైతుల పేరుతో కందులు కొనుగోలు చేయడంతో భారీగా అక్రమాలు జరిగాయి. సంబంధిత అధికారులపైన విచారించి క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. అయినా.. ఇప్పుడు అదే తీరు కొనసాగుతోంది.