ప్రొటెం స్పీకర్‌ కోసం ఆరుగురి పేర్లు ప్రతిపాదన

బిజెపి సీనియర్‌నే వరించనున్న పదవి?

ముంబయి,నవంబర్‌26(జనం సాక్షి): మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారమే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. దీంతో ప్రొటెం స్పీకర్‌ పదవి కోసం ప్రస్తుత ప్రభుత్వం.. ఆరుగురి పేర్లను ప్రతిపాదించింది. ఆ ఆరుగురి పేర్లను గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీకి పంపించారు. రాధాకృష్ణ వైఖే పాటిల్‌(బీజేపీ), కాళిదాస్‌ కోలంబ్కర్‌(బీజేపీ), బాబన్‌రావు భికాజీ(బీజేపీ), బాలసాహెబ్‌ థోరత్‌(కాంగ్రెస్‌), కేసీ పద్వి(కాంగ్రెస్‌), దిలీప్‌ వాల్సే పాటిల్‌(ఎన్సీపీ) పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. వీరిలో అత్యంత సీనియర్లు.. బాలసాహెబ్‌ థోరత్‌, కాళిదాస్‌ కోలంబ్కర్‌. సభలో అత్యంత సినీయార్టి ఉన్న వారికే ప్రొటెం స్పీకర్‌ పదవిని అప్పజెప్పడం జరుగుతుంది. ఈ ఆరుగురిలో ఒక్కరి పేరును గవర్నర్‌ ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రోటెమ స్పీకర్‌ అంటే తాత్కాలిక స్పీకర్‌. అధికారిక స్పీకర్‌ ఉండడు కాబట్టి.. బలపరీక్షకు కావాల్సిన తతంగం అంతా ఆయన చేతులవిూదుగానే సాగాల్సి ఉంటుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇచ్చిన లేఖ ప్రకారం.. గవర్నర్‌ ప్రోటెమ్‌ స్పీకర్‌ను నియమించడం జరుగుతుంది. 5 గంటల లోపే బలనిరూపణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఇప్పుడు కీలక బాధ్యతలన్నీ ప్రోటెమ్‌ స్పీకర్‌ ఆధీనంలోనే ఉంటాయి.