ప్లాస్టిక్ వాడటం వలన మానవుని మనుగడకు ముప్పు
జాతీయ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
— వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రమేష్
సుజాతనగర్ , అక్టోబర్ 18 (జనం సాక్షి ): నానాటికీ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వస్తువుల యొక్క వాడకం వల్ల పర్యావరణం తో పాటు మానవుని యొక్క మనుగడకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అని అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ అన్నారు. మంగళవారం సుజాతనగర్ మండల పరిధిలోని పాత అంజనాపురంలో జాతీయ సేవా సమితి ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వారం రోజులపాటు పాత అంజనాపురంలో అక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం ప్లాస్టిక్ రహిత పాత అంజనపురం గా అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ తో పాటు డాక్టర్ శిరీష, డాక్టర్ కాడ సిద్ధప్ప పాల్గొని మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల నేల నిర్జీవంగా మారుతుందని, వాతావరణంలో మార్పులు సంభవించి, అతివృష్టి, అనావృష్టి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ ఎం మంగమ్మ, ఉపాధ్యాయులు ప్రవీణ, 104 వాలంటీర్లు పాల్గొన్నారు.