ఆ ఐదుగురు… పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవు


తెల్లం, బండ్ల, గూడెం, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడిలపై అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్‌
వారంతా సాంకేతికంగా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్లు స్పష్టీకరణ
హైదరాబాద్‌(జనంసాక్షి):ఎమ్మెల్యేలు పార్టీ మారానడానికి ఎలాంటి ఆధారాలు లేవు.. అందువల్ల వారిని అనర్హులగా ప్రకటించలేమని తెలంగాణ తెలంగాణ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ తీర్పు వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తూ కీలక నిర్ణయం ప్రకటించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు చూపలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా.. ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పై ఈనెల 19న మరోమారు విచారణ జరగనుంది. ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేసిన సభాపతి.. బుధవారం ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్‌ కుమార్‌కు సంబంధించి గరువారం తీర్పు వెలువడనుంది. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కీలక తీర్పునిచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్‌ కొట్టివేశారు. వారిపై అనర్హత వేటు వేసేందుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ స్పష్టం చేశారు. పార్టీ మారినట్లు సరైన ఆధారాలు చూపలేదని తీర్పు సందర్భంగా స్పీకర్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి, ప్రకాష్‌ గౌడ్‌, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎం సంజయ్‌ కుమార్‌ లు తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌ పార్టీలోకి మారారని, వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు ఇచ్చారు. ఈ విషయంలో స్పీకర్‌ ఆలస్యం చేస్తుండటంతో.. బీఆర్‌ఎస్‌ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై పలు దఫాలుగా విచారించిన సుప్రీం ధర్మాసనం.. డిసెంబర్‌ 18వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌..బుధవారం ఐదుగురు ఎమ్మెల్యేల కేసులో తీర్పును వెలువరించారు.పార్టీ ఫిరాయింపుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేసిన పిటిషన్లను స్పీకర్‌ కొట్టేశారు. ఇక, మిగిలిన వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో గురువారం నాడు తీర్పు వెలువరించనున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలను ఇంకా విచారించాల్సి ఉంది. వీరికి స్పీకర్‌ నోటీసులు జారీ చేసినప్పటికీ.. ఎలాంటి రెస్పాన్స్‌ ఇవ్వలేదు. వీరి విషయంలో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్‌గా మారింది.

హైకోర్టులో సవాల్‌ చేస్తాం
` స్పీకర్‌ తీర్పు రాజ్యాంగ విరుద్దం: బీఆర్‌ఎస్‌
` అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ
` ఫిరాయింపు ఎమ్మెల్యల తీర్పుపై కేటీఆర్‌ ఆగ్రహం
` రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు: హరీశ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, ఆయన నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్‌ తెలిపారు. ఇది స్పీకర్‌ నిర్ణయం కాదని, జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌ రాజు నిర్ణయమని విమర్శించారు. స్పీకర్‌ను ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతున్నారని సంజయ్‌ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌ రాజు నుంచి ఎప్పుడో జడ్జిమెంట్‌ వచ్చిందని, ఆర్డర్‌ కాపీ జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌ నుంచి వచ్చిందని సంజయ్‌ విమర్శించారు. ట్రెజరీ బెంచ్‌కి టాయిలెట్‌ దగ్గరగా ఉంటుందని కాంగ్రెస్‌ వాళ్ళ పక్కన కూర్చున్నామని తమ ఎమ్మెల్యేలు చెబుతున్నారని సంజయ్‌ అన్నారు. ’మా వాదనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా తీర్పునిచ్చారు. స్పీకర్‌ తీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. తీర్పు కాపీని అధ్యయనం చేసి హైకోర్టుకు వెళ్తామ’ని సంజయ్‌ తెలిపారు. ట్రిబ్యునల్‌ చైర్మన్‌ గా ఉన్న స్పీకర్‌ తీర్పును వ్యతిరేకిస్తున్నామని, స్పీకర్‌ రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉండాలని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. స్పీకర్‌ పూర్తిగా విఫలమయ్యారని, స్పీకర్‌ తీర్పుపై జనాలు నవ్వుకుంటున్నారని, వ్యవస్థలపై ఉన్న నమ్మకం పోయిందని అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా అని సీఎం అన్నారని, తాజాగా స్పీకర్‌ జడ్జిమెంట్‌ కూడా సీఎం మాటలలాగానే ఉందని విమర్శించారు.
అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ : కేటీఆర్‌
ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండిరచారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ నిలువునా ఖూనీ చేసిందని విమర్శించారు. దేశ అత్యున్నత న్యాయస్థానాల పైనే కాదు.. చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్‌ గాంధీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని అన్నారు.బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్‌ పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి నేటి స్పీకర్‌ నిర్ణయం వరకూ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని కేటీఆర్‌ విమర్శించారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేక సార్లు ప్రకటించినా వారిని కాపాడటం రాహుల్‌ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని అన్నారు. కేవలం ఫోటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని.. తండ్రి చేసిన చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్‌ గాంధీ చరిత్రలో మిగిలిపోతారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల్లో పల్లెపల్లెనా వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతకు భయపడే కాంగ్రెస్‌ పార్టీ బై ఎలక్షన్స్‌ అంటే జంకుతోందని కేటీఆర్‌ అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోకుండా వెనకడుగు వేయడానికి ప్రధాన కారణం ఇదేనని తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమైపోయిందని విమర్శించారు. గోడ దూకిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడినట్టు కాంగ్రెస్‌ అనుకున్నా.. ప్రజాక్షేత్రంలో వారిని ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడో ప్రకటించేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తుంగలో తొక్కారని ఆరోపించారు. సేవ్‌ ది కానిస్టిట్యూషన్‌ అంటూ రాహుల్‌ గాంధీ ఢల్లీిలో ఉపన్యాసాలు ఇస్తారని.. కానీ ఆచరణలో మాత్రం ఆ నినాదం మాటలకే పరిమితమైందని ఆరోపించారు. ఆచరణలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిన ఈ ఘటనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిరది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశిరచిన యాంటీ`డిఫెక్షన్‌ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి.. అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం. ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమే. ఇది ఎంతో సిగ్గుచేటు. ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ అని అన్నారు. స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని మాజీ ఎంపి వినోద్‌ కుమార్‌ అన్నారు. స్వయంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పారు. కానీ ఇవాళ స్పీకర్‌ మాత్రం పార్టీ మారలేదు అని చెప్పడం ఎంత వరకు కరెక్ట్‌. 10వ షెడ్యూల్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి. పార్లమెంట్‌లో వెంటనే పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు.