ప్లైఓవర్‌కై మహాధర్నా… చంద్రబాబు హాజరు
విజయవాడ, జూన్ 24 : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం విజయవాడ పర్యటనకు రానున్నారు. కనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్లైఓవర్ నిర్మించాలన్న డిమాండ్‌తో టిడిపి నిర్వహించనున్న మహాధర్నాలో ఆయన పాల్గొననున్నారు. ఎంతో కాలంగా దుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మించాలని టిడిపి డిమాండ్ చేస్తుండగా స్థానిక ఎంపి లగడపాటి రాజగోపాల్ అందుకు అంగీకరించడంలేదు. సాంకేతిక సమస్యలను ఎత్తిచూపుతూ ఆయన ప్లైఓవర్ నిర్మాణం సాధ్యం కాదని సెలవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమీ తుమీ తేల్చుకోవడానికి టిడిపి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనుండగా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు. దీంతో విజయవాడ రాజకీయం వేడెక్కనుంది. మరోవైపు టిడిపి అన్ని విషయాలను రాజకీయం చేస్తోందని లగడపాటి రాజగోపాల్ ధ్వజమెత్తారు. ప్లైఓవర్ నిర్మాణం ఎందుకు సాధ్యం కాదో తాను వివరించినప్పటికీ కావాలనే మహాధర్నా చేపట్టిందన్నారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని, విజయవాడ వస్తున్న చంద్రబాబునాయుడు సమయం ఇస్తే తాను నేరుగా ఆయనతో చర్చలో పాల్గొంటానని లగడపాటి పేర్కొన్నారు.