ఫలించిన ఉపాధ్యాయుల పోరాటం
కరీంనగర్ ఎడ్యుకేషన్, జనంసాక్షి: సీనియారిటీ జాబితా విడుదల కోసం ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటం ఫలించింది. జాబితాను తక్షణ చేయాలంటూ పాఠశాల డైరెక్టర్ శ్రీహరి మంగళవారం డీఈవోను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని మూడు వేల మంది ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితా లేక స్టెప్‌అప్ ఫ్రీ ఫోన్‌మెంట్ సౌకర్యం కోసం ఇబ్బందులుపడుతున్నారు. సీనియర్లు అయి ఉండి కూడా జూనియర్ల కన్న తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ విషయమై పలు ఉపాధ్యాయ సంఘాల అనేక మార్లు డీఈవోకు విన్నవించినా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కానరాలేదు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనబాట పట్టాయి. ఆగస్టులో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ముట్టడించారు. గతంలో ఇన్‌చార్జీ డీఈవోగా పనిచేస్తున్న పూర్ణానందరావు ఉపాధ్యాయ సంఘాల ఒత్తిళ్లకు తలొగ్గి సీనియారిటీ జాబితా తయారీకి సిద్ధమయ్యారు. అంతలోనే ఆయనకు బదిలీ కావడంతో జాబితా తయారీ అటకెక్కింది. పూర్తి స్థాయి డీఈవోగా లింగయ్య నియామకం కావడంతో ఉపాధ్యాయ సంఘాలు సీనియారిటీ జాబితా విషయాన్ని తెరపైకి తెచ్చాయి. డీఈవో స్పందించకపోవడంతో ఒక్కోసంఘం ఒక్కోతరహాలో నిరసనలకు దిగాయి. ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పాతూరి సుధాకర్‌రెడ్డి ఉపాధ్యాయుల సంక్షేమంతో పాటు స్టెప్‌అప్ ఫ్రీఫోన్‌మెంట్ సౌకర్యం కల్పించడం తన కర్తవ్యమని హామీ ఇచ్చారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 వరకు 13 రోజుల పాటు నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టి జాబితా తయారీ కోసం తీవ్రమైన ఒత్తిడి చేశారు. దీంతో డీఈఒ ఫిబ్రవరి 16న పాఠశాల విద్యాశాఖ సంచాలకులకు పరిస్థితిని వివరించారు. తక్షణమే సీనియారిటీ లిస్టును విడుదల చేయకుంటే ఆందోళనలను ఉధృతం
చేస్తామని డీటీఎఫ్ నేతలు పాఠశాల విద్యాశాఖ సంచాలకులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీనియారిటీ జాబితాను తక్షణమే విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డీఈవోను ఆదేశించారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా మూడువేల మందికి పైగా ఉపాధ్యాయులు ఆర్థిక ప్రయోజనాన్ని పొందనున్నారు.
ఉపాధ్యాయ సంఘాల హర్షం
సీనియారిటీ జాబితా కోసం డీటీఎఫ్ చేసిన పోరాటం ఫలించిందని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాడుగుల రాములు, రాజిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు రఘుశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. సీనియారిటీ జాబితా తయారీకి ఆదేశాలు జారీ చేయడంపై పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్, రాజిరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో హర్షం వెలిబుచ్చారు.