ఫలించిన పోలీసుల భార్యల పోరు
డిమాండ్లకు తలొగ్గిన సర్కారు
హైదరాబాద్, ఆగస్టు 5 (జనంసాక్షి):
ఉన్నతాధికారుల అనుచిత నిర్ణయాలతో తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయంటూ ఎపిఎస్‌పి కానిస్టేబుళ్ల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎపిఎస్‌పి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తమ భర్తలను కుటుంబాలకు దూరం చేస్తున్నారని కానిస్టేబుళ్ల భార్యలు, వారి బంధువులు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్దమవుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో గల ఎపిఎస్పిలో 8వ బెటాలియన్‌లోని సిబ్బంది, వారి భార్యలు శనివారం నాడు జరిగిన ఆందోళనకు మద్దతుగా ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎపిఎస్పీ బెటాలియన్లలోని కానిస్టేబుళ్ల భార్యలు బెటాలియన్ల ఎదుట ధర్నాకు దిగారు. రెండవ రోజు ఆదివారం నాడు కూడా కొండాపూర్‌లోని రెండవ బెటాలియన్‌తో పాటు విజయనగరం జిల్లాలోని చింతలవలసలోని ఐదవ బెటాలియన్, కాకినాడలోని 3వ బెటాలియన్, కడపలోని 11వ బెటాలియన్, హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోని 1వ బెటాలియన్, ఆదిలాబాద్ జిల్లా గుడిపేటలోని 13వ బెటాలియన్, నల్గొండ అన్నెపర్తి బెటాలియన్ కార్యాలయాల ఎదుట పోలీసుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. వీరి ఆందోళన కారణంగా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న తమ భర్తలకు తమతమ జిల్లాల్లోనే విధులు కేటాయించేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నిబంధనల మేరకు సెలవులు ఇవ్వాలని, కుటుంబాలను సంరక్షించుకునే అవకాశం తమ భర్తలకు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇస్తేనే తప్ప, తమ ఆందోళన విరమించేది లేదని వారు ధర్నాకు దిగారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని హోంమంత్రి తమకు హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించబోమని కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌లో పనిచేస్తున్న పోలీసుల భార్యలు భీష్మించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎపిఎస్‌పి పోలీసుల భార్యలు ఆందోళనకు దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనిపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం నాడు స్పందించారు. ఆందోళన చేస్తున్న మహిళలతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కానిస్టేబుళ్ల కుటుంబాల ఆందోళనను తాము గుర్తించామని సమస్యలు పరిష్కరిస్తామని ఆమె చెప్పారు. సోమవారం నాడు ఉన్నతాధికారులతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ లోగా ఆందోళనను విరమించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. హోం మంత్రి ఆదేశాల నేపథ్యంలో ఎపిఎస్‌పి అడిషనల్ డిజి గౌతమ్ సవాంగ్ ఆందోళన కారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎబిసి గ్రూప్ సెలవులు రద్దు చేస్తామని వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై వారంలోగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సెలవుల విధానంలో కొత్త మార్పులు తీసుకువస్తామని, లంచాలు తీసుకొని సెలవులు ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని సవాంగ్ పోలీసు కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఆయన హామీ మేరకు ధర్నా విరమించుకునేందుకు సిద్దపడ్డారు. అయితే అదే సమయంలో కానిస్టేబుళ్ల కుటుంబాల నుంచి వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి వెంకటేశ్వరరావు అక్కడ కనిపించడంతో ఒక మహిళ ఆయనపై చెప్పు విసిరారు. దీనితో పరిస్థితి ఒక్కసారి ఉద్రిక్తంగా మారింది. వెంకటేశ్వరరావు డౌన్ డౌన్ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కల్పించుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఇదిలా ఉండగా పోలీసు అధికారులపై తాము దాడి చేసినట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవమని పోలీసుల కుటుంబాలు చెబుతున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం పోలీసుల కుటుంబాలన్ని కలసి మూకుమ్మడిగా కార్యాలయాలను ముట్టడించామే కాని, ఎవరిపైనా ఎలాంటి దాడులు చేయలేదని వారు చెప్పారు.
ఎప్పటి నుంచో ఎపిఎస్‌పిలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు సెలవులు లేకుండా, విశ్రాంతి లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. దీనితో రోజులు, నెలల తరబడి వారి కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో వారి కుటుంబాల్లో ఎవరికైనా ఆనారోగ్యం కాని ఇతరత్రా సమస్యలు వచ్చినప్పుడు కుటుంబం పెద్ద దూరంగా ఉండడంతో ఆయా కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురికావాల్సి వస్తుంది. ఈ తరుణంలోనే 8వ బెటాలియన్‌లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ కుటుంబానికి దూరంగా ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ విష జ్వరానికి గురయ్యాడు. అతడు ఎంత వేడుకున్నా అధికారులు సెలవు ఇవ్వకపోవడంతో ఆయన విధి నిర్వహణలోనే ఆరోగ్యం విషమించి మరణించాడు. దీనితో 8వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యల్లో ఆగ్రహాలు పెల్లుబికాయి. అధికారుల తీరును నిరసిస్తూ శనివారం నాడు వారు ఆందోళనకు దిగారు. అన్ని బెటాలియన్లలో ఇవే పరిస్థితులు నెలకొనడంతో కానిస్టేబుళ్ల భార్యలంతా ఏకమై ఎక్కడిక్కడ ఆయా బెటాలియన్ కార్యాలయాల ఎదుట ఆదివారం నాడు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా పోలీసుల్లో ప్రాంతీయ భావాలు ఉండకూడదని, అన్ని ప్రాంతాలు ఒక్కటే అన్న భావన కల్పించే ఉద్దేశంతో ప్రాంతాలకు అతీతంగా డ్యూటీలు వేస్తున్నామని ఎపిఎస్‌పి అధికారి ఒకరు చెప్పారు. ఉన్నతా ధికారులు నిర్ణయం మేరకే ఇలా వ్యవహరిస్తున్నా మని చెప్పారు. అయితే తమ పోలీసుల కుటుంబాల ఆందోళనను గమనించామని తప్పని సరిగా వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.