ఫాంహౌస్‌లో స్టీఫెన్‌తో కేసీఆర్ భేటీ
మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ బుధవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. వీరి భేటీ నేపథ్యంలో కేసీఆర్ ఫాం హౌస్ నుండి దాదాపు 5 కిలోమీటర్ల వరకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఓటుకు నోటు వ్యవహారం సంచలం సృష్టించిన విషయం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వబోతూ పట్టుబడ్డారు. ఇది తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయింది. నిన్నటి వరకు హైదరాబాదులో అధికారులు, పోలీసు బాసులతో భేటీ అయిన కేసీఆర్ మంగళవారం రాత్రి ఫాం హౌస్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా కాన్వాయ్‌లో వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సీఎం రాక తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ సుమతి, సిద్దిపేట ఆర్డీవో ముత్యం రెడ్డి తదితరులు ఫాంహౌస్‌కు తరలి వచ్చారు. పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కాగా, స్టీఫెన్ సన్ ఫాంహౌస్‌కి వచ్చి మాట్లాడిన నేపథ్యంలో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర పోలీసు ఆంక్షలు ఉంచారని వార్తలు రావడం గమనార్హం.