ఫీజు కట్టలేదని సెల్లార్లో పెట్టి తాళం వేశారు

– ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యం నిర్వాకం
న్యూఢిల్లీ. జులై11(జ‌నం సాక్షి) : ట్యూషన్‌ ఫీజు కట్టని పాపానికి ఢిల్లీలోని ఓ ప్రముఖ ప్రయివేట్‌ స్కూల్‌ యాజమాన్యం దారుణ నిర్వాకానికి ఒడిగట్టింది. 59 మంది నర్సరీ పిల్లల్ని స్కూల్‌ బేస్‌మెంట్‌లో నిర్బంధించి తాళం వేయించింది. దాదాపు ఐదుగంటల పాటు ‘బందీలుగా’ ఉన్న వీళ్లంతా నాలుగు నుంచి ఐదేళ్ల ఆడపిల్లలే కావడం గమనార్హం. రబియా గర్ల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో గతవారం జరిగిన ఈ షాకింగ్‌ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్కూల్‌ ముగిశాక తమ పిల్లల్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన తల్లిదండ్రులు చాలామంది పిల్లలు కనిపించలేదు. ఆందోళనకు గురైన పేరెంట్స్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో.. సిబ్బంది తాపీగా అసలు విషయం చెప్పారు. పీజులు చెల్లించని కారణంగా పిల్లల్ని సెల్లార్లో ఉంచి తాళం వేసినట్టు తెలిసి పేరెంట్స్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందరూ మూకుమ్మడిగా సవిూపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పాఠశాల యాజమాన్యంపై కేసుపెట్టారు. తమ పిల్లల్ని వదిలిపెట్టాలని ఎన్నిసార్లు వేడుకున్నా యాజమాన్యం అంగీకరించలేదనీ… దాదాపు ఐదుగంటల పాటు వారిని అలాగే ఉంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది క్రిమినల్‌ నేరమేననీ, పాఠశాల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా తాము అడ్వాన్స్‌గా ఫీజులు చెల్లించినప్పటికీ పిల్లల్ని సెల్లార్లో బంధించారని మరికొందరు పేరెంట్స్‌ ఆరోపించారు. తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో పోలీసులు
స్కూల్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.