ఫెమా ఉల్లంఘన కేసులో మంత్రి పార్థసారధికి ఊరట
హైదరాబాద్ : నవంబర్ 9,(జనంసాక్షి) మంత్రి పార్థసారథికి రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఫెమా ఉల్లంఘన కేసులో నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు ఆయనకు రెండు నెలల జైలు శిక్ష , రూ. 5 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కేసులో కోర్టు తీర్పు కాస్త ఊరట కలిగించింది. నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు ఆదేశాలను పార్థసారథి హైకోర్టులో సవాలు చేశారు. విచారణ అనంతరం కోర్టు శుక్రవారం స్టే విధించింది. ఫెమా ఉల్లంఘన కేసు పూర్తయ్యేంతవరకు దీనిపై స్టే కొనసాగుతుందని తెలిపింది. అంతకుముందు నెల రోజుల క్రితం కూడా ఢిల్లీలో ఫెమా ట్రిబ్యునల్ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. నిఘా ఉల్లంఘనకు సంబంధించి పార్థసారథికి ట్రిబ్యునల్ రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఈ ఆదేశాలను నిలుపుదల జారీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఈ రోజు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తమ ఆదేశాలు అమలులో ఉంటాయని కోర్టు తెలిపింది. కాగా ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చారనే కేసులో మంత్రి పార్థసారథికి గతంలో కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలలో స్వయంగా తమ ఎదుట హాజరు కావాలని కోర్టు పార్థసారథిరి జారీచేసిన సమన్లలో ఆదేశించింది. పార్థసారథిపై 177,171జి, 125ఏ, 195 సిఆర్‌పి సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎన్నికల కమిషన్ పార్థసారథి కేసు విషయాన్ని పేర్కొనక పోవడంపై చర్యలు ప్రారంభించింది. మంత్రి పార్థసారధి ఎన్నికల కమషన్ వద్ద తనపై ఉన్న కేసు విషయాన్ని దాచిపెట్టినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికలలో పార్థసారథి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిఫై అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన తన అఫిడవిట్‌లో పార్థసారథి తనపై కేసులు లేవని పేర్కొన్నారు. అఫిడవిట్ సమర్పించినప్పుడు కేసులు ఉంటే తప్పకుండా పేర్కొనవలసి ఉంది. కానీ పార్థసారథి మాత్రం ఈ విషయాన్ని పేర్కొనలేదు.