ఫైనల్ కి యువభారత్
లక్నో: కుర్రాళ్లు అద్భుతం చేశారు. పదిహేనేండ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న ప్రపంచకప్‌ను మరోసారి ఒడిసిపట్టుకునేందుకు సిద్ధమయ్యారు. సొంత ఇలాఖాలో అభిమానుల అపూర్వ మద్దతు మధ్య టోర్నీ ఆద్యంతం ఓటమన్నదే లేని యువ భారత్..ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 4-2(పెనాల్టీ షూటౌట్)తో అద్భుత విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోరు 2-2తో సమం కావడంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ తప్పనిసరైంది. షూటౌట్‌లో వికాస్ దహియా సూపర్ గోల్‌కీపింగ్‌తో టీమ్‌ఇండియా చిరస్మరణీయ విజయాన్నందుకుంది. భారత్ తరఫున గుర్జాంత్‌సింగ్(42ని), మన్‌దీప్‌సింగ్(48ని) గోల్స్ చేశారు. ఆసీస్ జట్టులో టామ్ క్రేగ్(14ని), షార్ప్ లాచ్లన్(57ని) గోల్స్ నమోదు చేశారు. అంతకుముందు జరిగిన మరో సెమీస్‌లో బెల్జియం 4-3(పెనాల్టీ షూటౌట్)తో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీపై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతి థ్య భారత్‌తో బెల్జియం తలపడుతుంది.