ఫైళ్లు గాయబ్ చేసిన ఆంధ్రా అధికారులు
– టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఘటన
హైదరాబాద్,ఆగస్ట్21(జనంసాక్షి):
టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ వింగ్‌లోని కీలక దస్త్రాలు మాయమైన విషయంలో బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో టీఎస్‌పీఎస్సీ అధికారులు ఫిర్యాదు చేశారు. కాన్ఫిడెన్షియల్ వింగ్‌లోని కీలక దస్త్రాలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో అధికారులు పేర్కొన్నారు. రహస్యపు గదిని నకిలీ తాళాలతో తెరిచి ఫైళ్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కీలక దస్త్రాల అపహరణపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కీలక దస్త్రాలను సీమాంధ్ర ఉద్యోగులే అపహరించి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీఎస్‌పీఎస్సీ అధికారి విఠల్ స్పందించారు. తమకు సమాచారం ఇవ్వకుండానే ఏపీపీఎస్సీ ఉద్యోగులు నకిలీ తాళం చెవితో కాన్ఫిడెన్షియల్ రూమ్‌లోకి ప్రవేశించి కీలక దస్త్రాలను తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తాము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గవర్నర్ నరసింహన్‌కు కూడా ఫిర్యాదు చేయబోతున్నట్లు వెల్లడించారు. . 2, 3 అంతస్తులు తెలంగాణకు, 4, 5 అంతస్తులు ఏపీకి కేటాయించారని గుర్తు చేశారు. మొదటి అంతస్తును అందరూ కామన్‌గా వాడుకోవాలని ఒప్పందం చేసుకున్నాం. ఈ ఒప్పందానికి గవర్నర్ ఆమోదం కూడా తెలిపారని గుర్తు చేశారు. ఒప్పందం ప్రకారం సీమాంధ్ర ఉద్యోగులు 2, 3 అంతస్తులను ఖాళీ చేయలేదు.దీంతో తాము ఐదవ అంతస్తులో కాన్ఫిడెన్షియల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తున్నందుకు రెండు అంతస్తులు సరిపోవడం లేదు. ఈ భవనం నుంచి ఏపీపీఎస్సీని ఖాళీ చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు.