బంగారు తెలంగాణ అభివృద్ది లక్ష్యం
అభివృద్ది సంక్షేమంలోమనమే ముందు: ఎమ్మెల్యే
జనగామ,జూన్20(జనంసాక్షి): తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందకు కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని చెప్పారు. అందులో భాగంగానే రైతాంగానికి ఎకరాకు రూ.10వేలు అందించడంతో పాటు కల్యాణలక్ష్మి, షాదీమూభారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీమాంధ్ర పాలకులు 60 ఏళ్లలో చేయని అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిందని అన్నారు. సీమాంధ్ర పాలనలోనే తెలంగాణ ప్రాతం వెనుకబాటుకు గురైందని దీంతో అభివృద్ధి జరుగలేదని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు సీసీ రోడ్లతో పాటు తారురోడ్లను నిర్మించేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు అయన తెలిపారు. చేపట్టే పనులను నాణ్యతతో కూడిన విధంగా చేయాలని నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే సహించేదిలేదని అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కోన్నారు.