బండి సంజయ్‌కు సలైన్ ఎక్కించిన వైద్యులు – దీక్ష భగ్నం
కరీంనగర్,అక్టోబరు 27(జనంసాక్షి):తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్బంధ దీక్షను పోలీసులు భగ్నమైంది అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి(అక్టోబర్ 26) నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆయన శరీరంలో షుగర్ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆస్పత్రికి తరలించడంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కాసేపటికి బీజేపీ నేతలు,మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి,జితేందర్ రెడ్డి ఆస్పత్రికి చేరుకుని బండి సంజయ్‌కి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. బీజేపీ దుబ్బాక ఉపఎన్నిక అభ్యర్థి రఘునందన్ రావు,ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం బండి సంజయ్ సిద్దిపేటకు బయలుదేరిన సంగతి తెలిసిందే. అయితే సిద్దిపేట శివారులోనే పోలీసులు ఆయన్ను అడ్డుకుని వెనక్కి పంపించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిడ్ తనపై దాడి చేశారని సంజయ్ ఆరోపించారు. అక్కడి పరిణామాలను నిరసిస్తూ కరీంనగర్‌లోని తన కార్యాలయంలో నిర్బంధ దీక్షకు దిగారు. సీపీని సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు బండి సంజయ్‌పై ఎలాంటి దాడి జరగలేదని సీపీ డేవిడ్ జోయల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎస్కార్ట్ ఇచ్చి గౌరవంగా కరీంనగర్‌కు పంపించామని తెలిపారు. నిజానికి అంతకుముందే ఆయనకు ఫోన్ చేసి శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో సిద్దిపేటకు రావద్దని కోరినట్లు చెప్పారు. అందుకు ఫోన్‌లో అంగీకరించిన ఆయన… ఆ తర్వాత సిద్దిపేటకు వచ్చారని చెప్పారు. సోమవారం చోటు చేసుకున్న పరిణామాలతో టీఆర్‌ఎస్,బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ ఇదంతా చేస్తోందని బీజేపీ ఆరోపిస్తుండగా… బీజేపీ గోబెల్ ప్రచారం చేస్తోందని టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. మొత్తం విూద దుబ్బాక పొలిటికల్ తారా స్థాయికి చేరడంతో ఏ క్షణం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.