బక్క జీవిపై గుది బండ
దెబ్బ మీద దెబ్బ పడితే బక్క జీవి బతికి బట్టగలిగే పరిస్థితులు నేడు లేవు. రాష్ట్ర ప్రయాణికుల నెత్తిపై ఆర్టీసీ ఆదివారం అర్ధరాత్రి నుంచి మరో పిడుగు వేసింది. ఆర్టీసీ చార్జీల పెంపుతో సంస్థకు కేవలం 362.92 కోట్ల రూపాయల ఆదాయం రానున్నదని, ఇంత పెంచినా సంస్థకు ఇంకా 372 కోట్ల రూపాయల నష్టం వస్తుందని స్వయాన ఆర్టీసీ ఎండి ఎ.కె.ఖాన్ చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తున్నది. సామాన్య ప్రయాణికులపై భారం పడకూడదనే లక్ష్యంతో అంతర్గత పొదుపు, ఖర్చుల నియంత్రణ చేపట్టామని అంటూనే ఉన్నత వర్గాలు, సంపన్నులు ప్రయాణించే వెన్నెల, గరుడ, ఇంద్ర బస్సులపై ఔదార్యాన్ని చూపింది. పేదల నడ్డి విరిచిన సర్కార్ పెద్దలపై కరుణ చూపింది. సామాన్యులు విరివిగా ప్రయాణించే పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులపై కనికరం లేకుండా సుదూర ప్రాంతాలపై భారీగా భారం పడింది. అయితే, ఈ పెంపు కేవలం 5 నుంచి 12 శాతమేనని చెబుతున్న ఆర్టీసీ యాజమాన్యం మాటలు కేవలం కంటితుడుపేనని, ఆచరణలో అవి కంటి మీద కునుకు లేకుండా చేసేంతగా పెరిగాయి. అంతర్గత పొదుపును మరింత సమర్థవంతంగా అమలు చేసి సంస్థను లాభాల్లోకి తెచ్చుకునేలా కృషి చేయాల్సి ఉండగా డీజిల్ ధరలు పెరిగాయంటూ సామాన్యుల నడ్డి విరిచేలా చార్జీలు పెంచడం అమానుషం. ఎప్పటికప్పుడు ఆర్టీసీలో నూతన విధానాలు, నిర్వహణ వ్యయం తగ్గించేందుకు అధికారులు చూపే వైఫల్యం వల్ల సంస్థపై మరింత ఆర్థిక భారం పడుతుంది. అదే రీతిలో ఆర్టీసీ సంస్థలో ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయిన డొక్కు బస్సులు సంస్థకు గుదిబండగా మారి వారి నష్టాలకు కారణమవుతున్నాయి. ఆర్టీసీ చార్జీల పెంపుతో సంస్థ 4 వేల కోట్ల రూపాయల నష్టాల భారీ నుంచి గట్టెక్కగలమనే ప్రజలను నమ్మబలకడం కేవలం భ్రమ. సిబ్బందికి శిక్షణ, గిరాకికి అనుగుణంగా బస్సుల పెంపు, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటు, సామాన్య ప్రజలకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయడం తదితర అంతర్గత చర్యలు తీసుకుంటేనే ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి బయట పడగలుగుతుంది. కానీ, వీటి జోలికి వెళ్లకుండా ప్రతిసారి నష్టాల పేరుతో ప్రజలపై భారం వేయడం రివాజుగా చేస్తోంది. ఆర్టీసీలో ఉన్న 20 వేల బస్సుల్లో 8 వేల డొక్కు బస్సులు ఉండడం గమనార్హం. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 10 లక్షల కిలోమీటర్లు తిరిగిన 5 వేల బస్సులను తొలగించాలి. కానీ, వీటిని పక్కన పెట్టకుండా నడపడం వల్ల డీజిల్ మరింత ఖర్చవుతూ, ఆర్టీసీకీ తడిసి మోపడవుతుంది. ఈ డొక్కు బస్సులు ఎక్కడానికి ప్రయాణికులు సుముఖత చూపకపోయినా తప్పని సరి పరిస్థితుల్లో ఎక్కుతున్నారు. దీంతో ఆర్టీసీ ఏటా 18 వందల కోట్ల రూపాయల డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇతరత్రా సామాగ్రికి మరో 350 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. మరో వైపు వ్యాట్ భారం వెన్నాడుతూనే ఉంది. రవాణా పన్నుల రూపంలో మరో 550 కోట్లను ఆర్టీసీ ఖజానాకు జమ చేస్తోంది. మన పక్కనే ఉన్న గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలను చూసైనా ఆర్టీసీ మెరుగైన విధానాలను అవలంబిచకపోవడం శోచనీయం. ఆర్టీసీ సేవా సంస్థ అంటూ సుద్దులు పలుకుతూనే మరో వైపు అనాలోచిత నిర్ణయాలతో భారాన్ని మోపుతున్నారు. కోల్‌కతా, ఢిల్లీలో ఒక శాతం, మహారాష్ట్రలో 3 శాతం, తమిళనాడులో 2 శాతం మోటారు వాహన పన్ను చెల్లిస్తుండగా, ఇక్కడ రాష్ట్ర సర్కారు 7 శాతం పిండుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇస్తున్న గ్రాంట్లను సైతం ఇక్కడి నేతలు మింగేస్తున్నారు. డీజిల్‌పై వ్యాట్ పడిన రాష్ట్రాల్లో దేశంలో కెల్లా ఇక్కడ ఎక్కువ. మారుతున్న ప్రజావసరాలకు అనుగుణంగా దీటుగా సేవలు అందించేందుకు సమర్థవంతమైన ప్రణాళికలకు సిద్ధం చేసుకుని, సంస్థను లాభాల బాటలోకి నడిపించాల్సి ఉండగా, సంస్థ అధికారులు అటువైపే అడుగు వేయడం లేదు. ప్రయాణికులకు సంతృప్తి కలిగించేలా సంస్థ సేవలు అందించకపోగా నిరంతరం కష్టాలపాలు చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాలకు బస్సులను నడిపిస్తున్నందున వల్ల ఏర్పడే నష్టాన్ని గుజరాత్ ప్రభుత్వమే భరిస్తోంది. కానీ, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. 10 ఏళ్ల తరువాత తమిళనాడులో సాధారణ బస్సులో కిలోమీటరుకు 42 పైసలు చొప్పున దేశంలోనే కనిష్ట చార్జీలను వసూలు చేస్తున్నారు. పండుగ సీజన్లో అదనంగా వేసే బస్సులకు అదనపు చార్జీలనేవి ఆ రాష్ట్రంలో ఉండవు. కానీ, ఇక్కడ మాత్రం ప్రత్యేక బస్సుల పేరుతో ప్రయాణికులకు పంగనామం పెడుతున్నారు. గాడి తప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ సరిగ్గా కుదురుకునేందుకు మూడేళ్లపాటు వెయ్యి కోట్ల ఆర్థిక సహాయం అందించి, దాన్ని సంస్థలో పెట్టుబడిగా పెట్టి లాభాలు గడించాలని నాలుగేళ్ల కిందట ఓ అధ్యయన నివేదిక ప్రభుత్వానికి హితవు పలికినా, ఆ ఫైలు ఈనాటికీ వెలుగు చూడలేదు. ఇలాంటి అంతర్గత లోపాలతో ఆర్టీసీ కుదేలవుతూ ప్రయాణికులపై భారాన్ని వేస్తూ చేతులు దులుపుకుంటోంది. పక్క రాష్ట్రాలు ప్రయాణికుల క్షేమము, వికాసానికి చేస్తున్న కృషిలో ఆరవ వంతు చేసినా, ఇక్కడ సంస్థ లాభాల బాటలోకి పయనించగలదు.