బడ్జెట్ బరాబర్‌గా ఉంది: ఈటెల
హైదరాబాద్,ఆగస్ట్22(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆర్థిక శాఖ అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగానే ఆదాయ వ్యయాలు ఉన్నాయన్నారు. భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని మినహాయిస్తే.. ఇప్పటికే దాదాపు 93 శాతానికి చేరుకున్నామన్నారు. సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్న మంత్రి.. గుడుంబా మహమ్మారిని తరిమికొట్టేందుకు చీప్ లిక్కర్ పాలసీని తెస్తున్నామని చెప్పారు. తమ బడ్జెట్ ఊహించిన రీతిలోనే సాగుతోందని, తొంభై శాతం లక్ష్యాలకు అనువుగా ఆదాయం వస్తోందని ఈటెల రాజేందర్ చెప్పారు. సంక్షేమానికి కాసులు కొరత అని, ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలకు డబ్బులు లేవని కొన్ని పత్రికలలో వస్తున్న కథనాలు వాస్తవం కాదని ఆయన అన్నారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కు సంబంధించి కూడా నిధులు విడుదల చేయబోతున్నామని అన్నారు. అయితే భూ విక్రయానికి సంబందించి మాత్రమే తాము బడ్జెట్ లో పెట్టినట్లుగా ఆదాయం సమకూరలేదని ఆయన చెప్పారు. ఆర్ధిక శాఖ కేవలం డబ్బులు మంజూరు చేసే విభాగంగానే కాకుండా, వాటిని ఖర్చు పెట్టిన తీరును కూడా పర్యవేక్షిస్తామని ఆయన అన్నారు. ఆడిటింగ్ విభాగాలను పటిష్టం చేస్తున్నామని ఈటెల చెప్పారు. నిధుల దుర్వినియోగాన్ని ప్రభుత్వం సహించబోదని అన్నారు. రైతు రుణమాఫీ లో కూడా ఆడిట్ చేయగా, కొన్ని అవకతవకలు జరిగినట్లు తేలిందని ఆయన అన్నారు.