బద్వేల్‌ ఉప ఎన్నికకు పటిష్ట ఏర్పాట్లు

మద్యం దుకాణాల మూసివేత
పోలింగ్‌ స్టేషన్లకు తరలిన సిబ్బంది
కడప,అక్టోబర్‌29(జనంసాక్షి):  కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ తెలిపారు. ఎన్నికకు 12 గంటల ముందుగానే నియోజకవర్గం సరిహద్దులన్నీ మూసేయాలని, నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలను అనుమతించొద్దని ఆదేశించారు. 28వ తేదీ సాయంత్రం 7 నుంచి 30 వ తేదీ రాత్రి 10 గంటల వరకూ, ఓట్ల లెక్కింపు రోజైన నవంబర్‌2న మద్యం షాపులను మూసేయాలన్నారు. 30న నియోజకవర్గంలో అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. 30న ఉదయం ఎన్నికల కోసం పోలింగ్‌ సిబ్బంది తరలి వెళ్లారు. భద్రతా బలగాలు గ్రామాల్లో బందోబస్తులో నిమగ్నమయ్యారు. స్థానికేతరులు రాకుండా నిరోధించారు. బద్వేలు నియోజకవర్గంలో బద్వేలు మున్సిపాలిటీ, గోపవరం, పోరుమామిళ్ల, బి.కోడూరు, కాశినాయన, పోరుమామిళ్ల, కలసపాడు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో సర్వీస్‌ ఓటర్లతో కలిపి 2,16,139 మంది ఉన్నారు. వారిలో మహిళలు 1,07,340 మంది, పురుషులు 1,08,777 మంది ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నిక తరహాలో భారీగా పోలింగ్‌ జరిగే అవకాశం ఉందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. 85 శాతం పోలింగ్‌ జరిగితే 1,83,718 ఓట్లు, 75 శాతం పోలింగ్‌ జరిగితే 1,29,683 ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో 1,50,621 ఓట్లు పోలైతే.. వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్యకు 95,482 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్‌కు 50,748 ఓట్లు వచ్చాయి. 44,734 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు.