*బయ్యారంలో బోనాల జాతర*
•భక్తి శ్రద్దలతో ముత్యాలమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన భక్తులు*
బయ్యారం,ఆగష్టు21(జనంసాక్షి):
బోనాల పండుగ అనగానే పల్లెటూరిలో ముత్యాలమ్మ తల్లి జాతర గుర్తొస్తుంది.దుష్ట శక్తులనుండి,రోగ పీడ నుండి పొలిమేరలో ఊరిని కాచుకునే గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి.శ్రావణమాసం రాగానే తెలంగాణ పల్లెల్లో గ్రామదేవతలకు భక్తులు బోనాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకోవడం ఆనాయితి. అంతటి ఘనమైన బయ్యారం ముత్యాలమ్మ తల్లి బోనాల జాతరకు ప్రత్యేకత ఉంది. బయ్యారంలో ఆనాది కాలం నుండి శ్రావణమాసంలో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.జాతర రోజు ఉదయం తొలి బోనం గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు డప్పుల చప్పుల్ల నడుమ పోతురాజు నృత్యాల సందడితో అమ్మవారికి తమ మొక్కులను బోనం రూపంలో సమర్పించడంతో జాతర ఆరంభమవుతుంది.ఇంటింటా వేపాకు తోరణాలతో పసుపు కుంకుమ బొట్టులతో అలంకరణ కనిపిస్తుంది. తరువాత వ్యవసాయంలో రైతులకు వెన్నుముకలా ఉండే ఎడ్లను శుభ్రపరిచి ఎద్దుల కాళ్ళకు పసుపు కుంకుమ తో బొట్లు పెట్టి ఎడ్ల బండ్లను రంగు కాగితాలతో అలంకరణ చేసి గ్రామంలోని అందరు రైతులు తమ ఎడ్ల బండ్లను,వ్యవసాయంలో ఉపయోగ పడే ట్రాక్టర్లను, నూతనంగా కొనుగోలు చేసిన వాహనాలను ఊరేగింపుగా తరలి పురవీధులు తిరిగే సమయంలో మహిళలు ఆ ఎద్దుల కాళ్ళ ముందు నీళ్లను పోసి,పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం సమర్పిస్తారు.అలా పురవీధులు ఊరేగింపుగా తిరిగి చివరకు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు జరుపుతారు. మేకపోతులు,యాటపోతులు, కోడిపుంజులు అమ్మవారికి మొక్కులుగా సమర్పిస్తారు.ఎప్పటిలాగానే ఆదివారం ముత్యాలమ్మ తల్లి బోనాల జాతరను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.డప్పు చప్పుళ్లతో,అమ్మవారికి సమర్పించే నైవేద్యాలతో బోనం తలపై పెట్టుకుని ఆడపడుచులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు.మహిళలు అమ్మవారికి వస్త్రాలను మొక్కుగా చెల్లించి బోనం ను నైవేద్యం గా సమర్పించారు.చక్కగా వర్షాలు పడి, మంచి పంట పండాలని అమ్మవారిని కోరుకుంటూ, దానికి తోడు చలిగాలులు, వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా అనారోగ్యాల నుంచి తమని కాపాడమంటూ అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు.