బయ్యారం ఉక్కుసాధనలో టిఆర్‌ఎస్‌ విఫలం

అందుకే పార్టీకి రాజీనామా: ఊకె అబ్బయ్య

కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కేంద్ర రాస్ట ప్ర భుత్వాలు విఫలం అయ్యాయని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య అన్నారు. ఇంతకాలం ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడిపారని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 2014 ఎన్నికల హావిూలను అమలు చేయడంలో వైఫల్యం చెందారని, తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవట్లేదని విమర్శించారు.అందుకే తాను తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెంలోని ఇల్లెందు మండలం హనుమంతులపాడులో తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. తెరాస అధినేత కేసీఆర్‌ నియంతృత్వ పోకడలతో పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని ఆరోపించారు. పార్టీ విధానాలు నచ్చకపోవడం వల్లే తాను ఆ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఏ పార్టీలో చేరుతున్నారనే విషయాన్ని ప్రస్తావించగా.. తన అనుచరులు, కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.