బస్తీ దవాఖానాల విస్తరణకు నిర్ణయం

పాత ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటుకు ఆమోదం

బస్తీదవాఖానాలపై మంత్రుల సవిూక్ష

కొత్తవాటి ఏర్పాటుపై మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన బస్తీ దవాఖానాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో వీటిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లతో పాటు పాత జిల్లా కేంద్రాల్లో బస్తీదవాఖానాలు ప్రారంభించాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పురపాలక, వైద్యారోగ్య శాఖ అధికారులు కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే నిజామాబాద్‌లో 5, కరీంనగర్‌ పట్టణంలో 5, వరంగల్‌ పట్టణంలో 12 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించామని మంత్రులకు అధికారులు తెలియజేశారు. అందరికి అందుబాటులో ఆరోగ్యం అనే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, దానికి అనుగుణంగా ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తోందని మంత్రులు కేటీఆర్‌, లక్ష్మారెడ్డి చెప్పారు. పట్టణాల్లో వైద్య ఆరోగ్య సదుపాయాల బలోపేతం, బస్తీ దవాఖానాల విస్తరణపై హైదరాబాద్‌ బేగంపేటలోని క్యాంప్‌ కార్యాలయంలో మంత్రులు ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన బస్తీ దవాఖానలకు ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందన నేపథ్యంలో వీటిని రాష్టం/-రలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్పోరేషన్లతోపాటు పాత జిల్లా కేంద్రాల్లో బస్తీ దవాఖానలు ప్రారంభించాలని మంత్రులు కేటీఆర్‌, లక్ష్మారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్‌ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఇప్పటికే నిజామాబాద్‌ లో 5, కరీంనగర్‌ లో 5, వరంగల్‌ లో 12 బస్తీ దవాఖానల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రులకు అధికారులు తెలిపారు. అందరికీ అందుబాటులో ఆరోగ్యం అనే స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడంతోపాటు.. పట్టణాల్లో బస్తీ దవాఖాన వంటి వినూత్నమైన ఏర్పాట్లతో ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రులు తెలిపారు. గత నెలలో తాను స్వయంగా బేగంపేటలోని బస్తీ దవాఖానను అకస్మిక తనిఖీ చేశానని, అక్కడి సేవలు ఉపయోగించుకునేందుకు వచ్చిన ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ముఖ్యంగా ప్రాథమిక వైద్య అవసరాల కోసం ఇంతకు ముందు ప్రైవేట్‌ క్లినిక్కుల్లో డబ్బులు ఖర్చు చేసేవాళ్లమని, ఇప్పుడు తమకు ఆ పరిస్థితి తప్పిందని సంతోషం వ్యక్తం చేశారన్నారు. ప్రజల నుంచి మరిన్ని బస్తీ దవాఖానలకు డిమాండ్‌ ఉన్నదని, ఈ నేపథ్యంలో వాటి విస్తరణకు ఈ సంయుక్త సమావేశం ఏర్పాటు చేశామని కేటీఆర్‌ చెప్పారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వచ్చే వేసవి నాటికి హైదరాబాద్‌ నగరంలో 500 బస్తీ దవాఖానలు ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే పనులు మొదలుపెట్టాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఈ డిసెంబర్‌ నెలాఖరుకు సుమారు 175 బస్తీ దవాఖానలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నగర జనాభా వైద్య అవసరాలను అందుకునేలా, ముఖ్యంగా పేదల సంఖ్య అధికంగా ఉండే ప్రాంతాల్లో ఇవి ఉండేలా చూడాలన్నారు. బస్తీ దవాఖానలన్నింటినీ ఆన్‌ లైన్లో మ్యాపింగ్‌ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఈ మేరకు అవసరం అయితే ఐటి శాఖ సహకారం తీసుకోవాలని కేటీఆర్‌ సూచించారు.ఈ 500 బస్తీ దవాఖానలకు అవసరం అయిన భవనాలు గుర్తించాలని, ఒకవేళ భవనాలు అందుబాటులో లేకుంటే కొత్తగా నిర్మించేందుకు చర్యలు ప్రారంభించాలని పురపాలక శాఖాధికారులను మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభానికి సిద్ధం చేస్తున్న మరో 28 బస్తీ దవాఖానలను సెప్టెంబర్‌ మొదటి వారంలో ఒకేరోజు ప్రారంభించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. బస్తీ దవాఖానలతో పాటు తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ సేవలను సైతం మంత్రులు సవిూక్షించారు. ఇప్పటికే ఈ సెంటర్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని వైద్య ఆరోగ్య శాఖాధికారులు మంత్రులకు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ సెంటర్ల ఏర్పాటు లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు తయారు చేస్తున్నదనిఅధికారులు చెప్పారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ సేవలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద సమాచారం అందుబాటులో ఉంచాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, కమిషనర్‌ వాకాటి కరుణ, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.