బహిరంగ చర్చకు సిద్ధం
– విపక్షాల సవాల్ స్వీకరించిన హరీశ్ రావత్
డెహ్రాడూన్,జులై 9(జనంసాక్షి): ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ బిజెపి విసిరిన సవాల్‌కు సై అన్నారు. గతంలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ సమయంలో రావత్‌పై తీసిన స్టింగ్ ఆపరేషన్ వీడియో గురించి రావత్ బహిరంగంగా చర్చించాలని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ సవాలు విసిరి సంచలనం సృష్టించారు. రావత్‌కు నైతిక విలువలు ఉంటే బహిరంగ వేదికపై స్టింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడాలని అజయ్ అన్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని హరీష్ రావత్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. రాజకీయ సంక్షోభం సమయంలో రావత్ ఎమ్మెల్యేలకు డబ్బు ఇవ్వజూపాడని స్టింగ్ ఆపరేషన్‌లో తేలిందని మొదటి నుంచి బిజెపి ఆరోపిస్తుంది. ఈ ఆపరేషన్ సీడీపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. ఇదిలా ఉండగా రావత్ ఇటీవల తన ఇంటి వద్ద ‘జనసంవాద్’ కార్యక్రమంలో భాగంగా సమావేశమైన ప్రజలతో స్టింగ్ ఆపరేషన్ వీడియోపై వివరణ ఇవ్వడం గురించి విలేకరులు బిజెపి నేత అజయ్ భట్‌ను ప్రశ్నించారు. దీంతో ఆయనకు నైతిక విలువలు ఉంటే బహిరంగ వేదికపై దాని గురించి మాట్లాడాలని అజయ్ సవాల్ చేశారు. దీంతో దీనిపై స్పందించిన హరీష్ రావత్ బహిరంగ చర్చకు తాను సిద్ధమేనంటూ ప్రకటించారు. ఈ కేసు రాను రానూ ఎటు దారి తీస్తుందో చూడాలి.