బాబును టచ్‌చేయాలని చూస్తే..
బీజేపీ భస్మంకావడం ఖాయం
– ముందస్తు నోటీసివ్వకుండా నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ ఎలా జారీచేస్తారు?
– రాజకీయ కుట్రలో భాగంగానే వారెంట్‌జారీ
అమరావతి, సెప్టెంబర్14(జనంసాక్షి) : బాబును టచ్ చేయాలనిచూస్తే బీజేపీ భస్మం కావడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు పోరాటం చేసి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. అయితే, ఈ కేసులో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు నాన్-బెయిల్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. దీనిపై బుద్దా మాట్లాడారు. ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తికి ఏలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నాన్‌బెయిలబుల్ వారెంట్ ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల నాటి కేసులో ఇప్పుడు వారెంట్ జారీ చేయడం కేవలం రాజకీయ కుట్రేనని వెంకన్న దుయ్యబట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బాబ్లీ వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు అక్కడ నిరసన తెలిపారని అన్నారు. ప్రజల కోసమే చంద్రబాబు ఆనాడు పోరాటం చేశారని, తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న ఓ వ్యక్తి పోలీసులతోనూ నాడు లాఠీ దెబ్బలు తిన్నారని పేర్కొన్నారు. సీఎంపై బీజేపీ కక్ష్య సాధింపు చర్యలను మానుకోవాలని ఆయన సూచించారు. గతంలో ఎప్పుడూ నోటీసులు జారీచేయకుండానే ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీచేయడమేంటని బుద్ధా వెంకన్న నిలదీశారు. చంద్రబాబును వేధించాలని చూస్తే మోదీకి గుణపాఠం తప్పదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి నిరసనను తట్టుకోవడం ఆయన తరంకాదని వెంకన్న
హెచ్చరించారు. బాబును టచ్‌చేయాలని చూస్తే బీజేపీ భస్మంకావడం ఖాయమని అన్నారు. ఏపీ పట్ల, సీఎం చంద్రబాబు పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ఎక్కడా బీజేపీ జెండా కనిపించకుండా చేస్తామని పేర్కొన్నారు. శాంతియుత నిరసనలతో గట్టిగా సమాధానం చెబుతామని, మోదీ బెదిరింపులకు చంద్రబాబు భయపడరని, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా తమ అధినేతకు ఉందని ఎమ్మెల్సీ వెంకన్న ఘాటుగా బదులిచ్చారు. కేంద్రం కక్షసాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబుకు జారీచేసిన అరెస్ట్ వారెంట్‌పై కేసీఆర్ స్పందించాలని ఆయన కోరారు.
ఎలాంటి నోటీసులివ్వకుండా అరెస్ట్ వారెంట్ దారుణం – ఎల్. రమణ
బీజేపీ రాజకీయ కుట్రకు తెరతీసిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే బాబ్లీ ప్రాజెక్టు వద్ద చంద్రబాబు పోరాటం చేశారని, ఎనిమిదేళ్ల కిందట కేసులో ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్ జారీచేయడం దారుణమని అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గానూ మహారాష్ట్రలోని ధర్మాబాద్ మేజిస్టేట్ర్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. చంద్రబాబు, దేవినేని ఉమా మహేశ్వరరావు, గంగుల కమలాకర్, ప్రకాశ్ గౌడ్, విజయ రమణారావులతో సహా 14మందిని సెప్టెంబరు 21లోగా కోర్టులో హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొంది.