బాబు బయటపడ్డడు !
అదే జరిగింది. అనుకున్నదే అయింది. పుట్టుకతో వచ్చితో పల్లల్తో కాలబెట్టే దాక పోదని నిరూపితమైంది. టీడీపీ ఎప్పటిలాగే తన వైఖరిని కొనసాగించింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎప్పటిలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమ పార్టీ నిర్ణయాన్ని నాన్చేశారు. తమ పార్టీ ఈ విషయంలో పాత విధానాన్నే అవలంబిస్తుందని స్పష్టం చేశారు. శనివారం జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశం మీద మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు. అంతే కాకుండా, తెలంగాణపై వచ్చే నెల మొదటి వారంలో ‘స్పష్టమైన’ వైఖరి తెలుపుతామని వెల్లడించారు. టీడీపీ అధినేత తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణకు చెందిన ఆ పార్టీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఈ పొలిట్ బ్యూరో సమావేశం తర్వాతైనా ఏదో ఒక నిర్ణయాన్ని స్పష్టంగా తెలుపుతామని భావించిన తెలంగాణ టీడీపీ నాయకులు నిర్వేదంలో మునిగిపోయారు. ఇటు తమ నాయకుడిని ఎదిరించ లేక, అటు తెలంగాణవాదులకు జవాబు చెప్పలేక సతమతమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీని కాపాడాలని తాము చేస్తున్న ప్రయత్నాలకు బాబు ప్రకటన గండి కొట్టినట్లుగా ఉందని వారు భావిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో చంద్రబాబు స్పష్టమైన నిర్ణయాన్ని తెలుపుతామని ప్రకటించినా టీటీడీపీ నాయకులు మాత్రం సంతృప్తి చెందలేదు. ఇదిలా ఉండగా, తెలంగాణవాదులు మాత్రం తాము ఊహించినట్లుగానే జరిగిందని తేలికగా తీసుకుంటున్నారు. టీడీపీ అధినేతకు తమ పార్టీ తెలంగాణలో మనుగడ సాగించాలన్న ఆశ లేనట్లుగా ఉందని భావిస్తున్నారు. ఎప్పటిలాగే బాబు తనవి ‘రెండు కళ్లని’ తేల్చి చెప్పాడని అనుకుంటున్నారు. ఇక తెలంగాణలో బాబు పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని తెలంగాణవాదులు నొక్కి చెబుతున్నారు. దీన్ని బట్టి తెలంగాణపై తమ వైఖరి తమ పార్టీ తెలుపకుండా పరోక్షంగా తెలంగాణ బిడ్డల ఆత్మహత్యకు కారణమైనట్లు బాబు ఒప్పుకున్నారని ఆరోపిస్తున్నారు. నిజమే కదా ! దాదాపు ఎనిమిది వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నా, స్పందించని చంద్రబాబు ఈసారి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తాడని అనుకోవడం అతిశయోక్తేనని అంటున్నారు. ఇక ముందు కూడా ఆ పార్టీ తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తెలుపుతుందని తాము ఆశించడం లేదన్నారు. టీడీపీ ముమ్మాటికీ సమైక్యవాద పార్టీయేనని, ఆ పార్టీ మనుగడ ఇక తెలంగాణలో కష్టమేనని భావిస్తున్నారు. తాము ఏ నిర్ణయం తెలిపినా తెలంగాణ ప్రజలు నమ్మరని తెలుసుకున్న చంద్రబాబు, సమైక్యవాదానికే కట్టుబడుతున్నట్లు చెప్పకనే చెప్పారన్నారు. అయోమయంలో ఉన్నామంటున్న బాబు స్పష్టమైన వైఖరి తెలుపక, నాడు వచ్చిన ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకున్నారని, ఫలితంగా తెలంగాణ బిడ్డలు ప్రాణార్పణ చేశారని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఇక టీడీపీ మూటే ముళ్లె సర్దుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. టీడీపీ తెలంగాణ ఫోరం నాయకులు కూడా తమ నాయకుడిపై ఆశలు వదులుకుని తెలంగాణ ఉద్యమంలోకి ప్రత్యక్షంగా పాల్గొనాలని, లేకుంటే ఒకప్పుడు ఫలానా పార్టీ నాయకులు తెలంగాణలో ఉన్నారన్న విషయం చరిత్రలో చదువుకోవడమే తప్పితే, సమీప భవిష్యత్తులో వారికి చోటుండదని హెచ్చరిస్తున్నారు. ఏదైనా అంతా తెలంగాణ మంచికే.. బాబు బయటపడ్డడు !