బాలికా సంరక్షణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి అదనపు జెసి నీలకంఠం

నల్గొండ, జనవరి 4 (): అధికారులు సమన్వయంతో పనిచేసి బాలికా సంరక్షణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అదనపు జెసి నీలకంఠం కోరారు. శుక్రవారం నాడు తనఛాంబర్‌లో వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖతోపాటు ఇతర అనుబంధ శాఖలతో సమన్వయ కమిటీ సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ నెల 24, 25 తేదీలలో దేవరకొండలో బాలికా సంరక్షణ దినోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మహిళలను భాగస్వాములను చేసి నిర్వహించాలని కోరారు. స్త్రీ సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యా శాఖ ఇతర అనుబంధ శాఖలన్నీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చే సి  7వ తేదీలోగా సమర్పించాలని అదనపు జెసి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మీడియా, క్రీడల శాఖ, వ్యవసాయం, స్త్రీ సంక్షేమ శాఖలు భాగస్వాములై మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహణ కలిగించాలని కోరారు. ఈ నెల 8,10,11 తేదీలలో స్త్రీ సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కలిసి మార్పు, ఇందిరమ్మ అమృత హస్తం కార్యక్రమాలపై ఆరు. ఐ.సి.డి.ఎస్‌.ప్రాజెక్టుల పరిధిలో మహిళలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన కోరారు. దేవరకొండ, చౌటుప్పల్‌, ఆలేరు, చందంపేట, డిండి తదితర  ఐ.సి.డి.ఎస్‌. ఏరియాల పరిధిలో కార్యక్రమాలు నిర్వహణకై వెంటనే  చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కరపత్రాలు, ఇతర ప్రచార సామాగ్రి ద్వారా విస్తృత అవగాహన కలిగించాలని కోరారు. గృహ హింసకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్యత నిచ్చి 108 వాహనాలను భాగస్వాములను చేసినందున 108 సేవలు సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. సమావేశంలో డిఎంఅండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ ఆమోస్‌ తదితరులు పాల్గొన్నారు.