బాల్య వివాహాల నిషేధంపై జీవో – నిబంధనలతో గెజిట్ విడుదల
కాకినాడ, జూన్ 27 : రాష్ట్రంలో బాల్యవివాహాల నిషేధాన్ని పటిష్ఠవంతంగా అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం జీవో ఎంస్ నెం.13 ద్వారా 2006 బాల్య వివాహాల నిషేద చట్టానికి సంబంధించి బాల్య వివాహాల నిషేధం నిబంధనలు 2012 పేరిట ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారి (సిఎంపివో)గా ఉంటారు. అలాగే డివిజన్ స్థాయిలో ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్, 3 నుంచి 5 మండలాలు కలిగిన ప్రాజెక్టు స్థాయిలో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారి (సిడిపివో), మండల స్థాయిలో సంబంధిత తహశీల్దార్, ఐసిడిఎస్ సూపర్‌వైజర్, గ్రామ స్థాయిలో గ్రామ పరిపాలనాధికారి, గ్రామ రెవెన్యూ అధికారులు చైల్డ్ మ్యారెజ్ ప్రొహిబిషన్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఈ అధికారులు వారివారి స్థాయిల్లో ఈ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తూ ఎక్కడైనా బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం ఏ రూపంలో తెల్సినా వెంటనే స్పందించి పోలీసులు సమాచారం అందించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మౌఖికంగా లేదా వ్రాతపూర్వకంగా లేదా లేఖ రూపంలోనూ టెలిఫోన్, టెలిగ్రామ్, ఇ-మెయిల్ తదితర ఏ రూపంలోనైనా ఇందుకు సంబంధించిన సమాచారం తెల్సిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంతో పాటు ఆ సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొవడం జరిగింది. అంతేగాక బాల్యవివాహాల నిషేధం అమలుకు జిల్లా, డివిజన్, మండల గ్రామ స్థాయిల్లోని వివిధ స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, మండల, జిల్లా సమాఖ్యలతోను సమన్వయంతో పనిచేస్తూ ఈ చట్టం పటిష్ఠ అమలుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి నమోదయ్యే కేసులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులను కాపాడ వారికి అవసరమైన పునరావాసం కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలి. బాల్యవివాహాల నిషేధంపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా బాలికా మండళ్లను యాక్టివేట్ చేసే పీర్ గ్రూపులను అనగా కౌమార బాలికలను చైతన్యవంతం చేయాలి. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారులకు ప్రభుత్వం విశేషమైన అధికారులను ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. అవి ఏమిటంటే…. దర్యాప్తు చేయడం, సంబంధిత పార్టీలు, సాక్షులకు సమన్‌లు జారీ చేయడం, వారి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేయడం, బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయడం వంటి అధికారులు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, కమిషనర్, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డివిజనల్ స్థాయిలో సబ్ కలెక్టర్ కానీ, ఆర్‌డివోలు కానీ, నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. నోడల్ అధికారులు ప్రతి నెల సమావేశాలు నిర్వహించి ఈ చట్టం పటిష్ట అమలుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గ్రామ స్థాయి నుంచి ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన, పంచాయితీ సెక్రటరీ, ఇతర అధికార, అనధికార సభ్యులుగా బాల్య వివాహ నిషేధం, పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతోంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నోడల్ అధికారులు వివిధ శాఖల అధికారులు, బాల్య వివాహలపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, సమన్వయంతో బాల్య వివాహాల నిషేధ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించి పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేయడం జరుగుతుంది.