బాల్‌థాకరే అంత్యక్రియలు….శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రజలు

 

శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రజలు

ముంబయి, నవంబరు 18 (ఎపిఇఎంఎస్‌):మరాఠా యోధుడు బాల్‌థాకరే అంతిమయాత్ర ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ప్రారంభమైంది. మాతోశ్రీ నుంచి బాల్‌ థాకరే పార్దీవ దేహాన్ని ప్రత్యేక వాహనంపైకి చేర్చారు. ఆయన కుమారుడు ఉద్దవ్‌, ఉద్దవ్‌ సతీమణి రష్మి, ఇతర కుటుంబ సభ్యులు పార్దీవ దేహం పక్కన ఆశీనులయ్యారు.అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. తమ నేతకు శ్రద్ధాంజలి ఘటించారు. బాల్‌ థాకరే పార్దీవ దేహాన్ని కొద్దిసేపు సేవాసదన్‌లో ఉంచారు. అనంతరం శివాజీపార్కుకు తరలించారు. ఆయన పార్దీవ దేహంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. ప్రజల సందర్శనార్ధం ఆయన పార్దీవదేహాన్ని సాయంత్రం వరకు ఉంచుతారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండగా బాల్‌ధాకరే పార్దీవదేహం అంతిమ యాత్ర సందర్భంగా బాంద్రా నుంచి దాదార్‌ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బాల్‌ధాకరే మృతి పట్ల సంతాప సూచకంగా ఆదివారంనాడు సినిమా షూటింగ్‌లను నిలిపివేశారు. అలాగే దుకాణాలు, వ్యాపార సంస్థలు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. టాక్సీలు నిలిచిపోయాయి. జన జీవనం స్తంభించింది. బాల్‌ ధాకరే అంతిమ యాత్ర సందర్భంగా మొత్తం ప్రత్యేక రైళ్లు, బస్సులు నడిపారు. భారీగా కార్యకర్తలు, అభిమానులు శివాజీ పార్కు వద్దకు చేరుకుంటున్నారు. శివాజీ పార్కులోనే బాల్‌ధాకరే పార్దీవ దేహానికి అంతిమసంస్కారం జరగనున్నట్టు సమాచారం.

సర్వత్రా విషాదం…

శివసేనాధిపతి బాలా సాహెబ్‌ అస్తమయాన్ని మహారాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం మధ్యాహ్నం బాల్‌ధాకరే కన్నుమూశారన్న విషయం తెలిసిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు మాతోశ్రీకి తరలి వచ్చారు. ఆదివారంనాడు కూడా తరలివస్తూనే ఉన్నారు. తమ ఇంటి పెద్ద పోయినంత బాధతో వారు విలవిలలాడుతున్నారు. చిన్నా.. పెద్దా సైతం రోదిస్తున్నారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొని జోహార్లర్పిస్తున్నారు. బాలాసాహెబ్‌ అమర్‌ రహే అంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

బాల్‌ధాకరే..ఓ అధ్యాయం..

మహారాష్ట్ర అనే చరిత్ర పుస్తకంలో బాల్‌ధాకరే ఓ అధ్యాయం.. ఇక నుంచి ఆ ప్రాంత ప్రజలు బాల్‌ ధాకరే ముందు.. బాల్‌ధాకరే అనంతరం అని చెప్పుకోవాల్సిందే. ఆ విధంగా మహారాష్ట్రలో ఆయనొక చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయారు. బాల్‌థాకరే దాదాపు ఐదు దశాబ్దాల్లపాటు ఆయన మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు. కరుడుగట్టిన హిందుత్వ వాదిగా బాల్‌ థాకరే సుపరిచితుడు. భారత సంస్కృతి సాంప్రదాయల పట్ల మక్కువ. మరాఠా ప్రజల హక్కుల కోసం ఆయన అవిశ్రాంత పోరాటం జరిపారు. స్థానికులకే స్థానిక వనరులు అందాలని పెద్ద ఎత్తున ఉద్యమం నడిపారు. దక్షిణప్రాంతాలు, గుజరాతీలపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. 1926 జనవరి 23న మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో రాంబాయ్‌, కేశవ్‌ థాకరే దంపతులకు జన్మించారు. కేశవ్‌ థాకరే సంఘసంస్కర్త. తండ్రి కేశవ్‌ థాకరే… ఆయన ప్రభోదంకర్‌గా ప్రసిద్ధి. సంఘసంస్కర్తగా పేరొందారు. సామాజిక రుగ్మతలపై పోరాడారు. 1950లో సంయుక్త మహారాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. తండ్రి నుంచి ఈ పోరాటాన్ని వారసత్వంగా బాల్‌ థాకరే స్వీకరించారు. బాల్‌ థాకరే తొలినాళ్ళలో ‘ది ప్రిపెస్‌ జర్నల్‌’లో కార్టూనిస్టూగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ సండే ఎడిషన్‌కు కార్టూన్‌లు వేశారు. తొలినాళ్ళ నుంచి తనదైన శైలిలో గీత, రాతలకు పదునెక్కించారు. తన సునిశిత వ్యంగ్య వ్యాఖ్యానాలు గీతల ద్వారా సమాజంలోని రుగ్మతలు, రాజకీయ వైఫల్యాలను ఎండగట్టారు. ఆ పత్రిక యాజమాన్యంతో విభేదించి 1960లో సొంతంగా ‘మార్మిక్‌’ పేరిట రాజకీయ వారపత్రికను ప్రారంభించారు. దేనికీ వెరవని నైజం, తాను నమ్మిన సిద్దాంతానికి నిజాయితీగా కట్టుబడే నైజం..ముక్కుసూటితత్వం..అనుకున్నది సాధించే మొండితనం బాలాసాహెబ్‌ సొంతం. తదనంతర కాలంలో ఆయన హిందుత్వానికి ఒక శిఖర స్వరూపంగా మారడంలో ఈ లక్షణాలు ఎంతో దోహదపడ్డాయి. జర్నలిస్టుగా, కార్టూనిస్టూగా ఉంటూనే కాలక్రమంలో ఆయన రాజకీయాలలో ప్రవేశించారు. ఈ క్రమంలో 1966 జూన్‌ 19న శివసేన పేరుతో సెంట్రల్‌ ముంబాయిలోని దాదర్‌లో గల శివాజీపార్కులో భారీ బహిరంగసభలో శివసేన రాజకీయ పార్టీని ప్రకటించారు. పార్టీ కార్యకర్తలకు శివసైనికులుగా నామకరణం చేశారు. ఇక అక్కడ నుంచి మరాఠా ప్రజల హక్కుల కోసం ఉద్యమించారు. స్థానికులకే వనరులు దక్కాలని, ఇక్కడి ప్రజలకే ఇక్కడ ఉద్యోగాలు సొంతమని, ఇతరులకు స్థానం లేదని నినాదంతో మహరాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నారు. తన పక్షాన్నే శివసేన పార్టీ నిలుస్తుందన్న భరోసాను అక్కడి ప్రజల్లో అణువణువునా నింపారు. పార్టీకి తిరుగులేని బలంగా ప్రజలను నిలబెట్టారు. బాల సాహెబ్‌ మాట ప్రజలకు వేదవాక్కుగా నిలిచేలా ప్రజల్లో అభిమానాన్ని చూరగొన్నారు. మహారాష్ట్రను భాషాప్రయుక్త రాష్ట్రంగా తీర్చి దిద్దాలని గట్టి కృషి చేశారు. భూమిపుత్రుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 1989లో ‘సామ్నా’ పత్రికను, హిందీ పత్రిక ‘దుపార్‌కా సామ్నా’ స్థాపించారు. ఆయన బహిరంగంగా కనపడకపోయినా పత్రిక ద్వారా తన భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. సామ్నా అక్షరాలు బాలసాహెబ్‌ ఆదేశాలుగా తీర్చిదిద్దారు. ప్రత్యుర్థులపై ఆయన ఘాటైన, నిశితమైన విమర్శానాస్త్రాలు సంధించేవారు. తనకు నచ్చని సిద్ధాంతాన్ని నిర్మోహమాటంగా ఖండించేవారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ వంటి నాయకులను కూడా ఆయన తన రచనల ద్వారా నిలదీసేవారు. వారి విధానాలు నచ్చకపోతే ఖండించేవారు.. ఇలా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా.. ఇంకా మిగిలే ఉంటుంది.