బాల నేరస్థుడి విడుదలను వ్యతిరేఖిస్తూ ఆందోళన

2

– జ్యోతిసింగ్‌ తల్లిదండ్రుల అరెస్టు

దిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో బాల నేరస్థుడు విడుదలయ్యాడు. దిల్లీలోని ఓ ఎన్జీవో సంరక్షణలో బాల నేరస్థుడు ఉండనున్నాడు. మరోవైపు జువైనల్‌ రిలీజ్‌ పై ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. బాల నేరస్థుడి విడుదలను వ్యతిరేకిస్తూ నిర్భయ తల్లిదండ్రులు, మహిళా సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి.నిర్భయ కేసులో మూడేళ్లపాటు శిక్ష అనుభవించిన బాల నేరస్తుడు ఇవాళ విడుదల కానున్నాడు. దాంతో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో అతని విడుదలకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. అయితే బాల నేరస్థుడి విడుదలను అడ్డుకునేందుకు ఢిల్లీ ఉమెన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ స్వాతి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతని విడుదలను అడ్డుకోవాలని నిన్న ఢిల్లీ కోర్టుకు వెళ్లిన ఆమె.. ఇవాళ జువైనల్‌ బోర్డ్‌ కు లేఖ రాశారు. అంతేకాదు ఢిల్లీ హైకోర్టు తీర్పును ఢిల్లీ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌ సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై వాదనలను వినడానికి సుప్రీం కోర్టు సోమవారం అవకాశం కల్పించింది. అటు బాల నేరస్థుడి విడుదలపై నిర్భయ పేరెంట్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  నిర్భయ కేసులో పిన్న వయస్కుడైన దోషి విడుదలకు సంబంధించి శనివారం రాత్రి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ కూతురిని అత్యాచారం చేసిన దోషిని విడుదల చేయవద్దంటూ నిర్భయ తల్లిదండ్రులు, దిల్లీ మహిళా కమిషన్‌ శనివారం హైకోర్టుకు అప్పీల్‌ చేశాయి. చట్ట ప్రకారం పిన్న వయస్కుడైన దోషి విడుదలను ఆపడం కుదరదని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివల్‌.. దోషి విడుదలపై స్టే విధించాలని అర్ధరాత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఏకే గోయెల్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌ల ధర్మాసనం విచారించి విడుదలపై స్టే విధించడానికి నిరాకరించింది. ఈ అంశంపై తదుపరి విచారణ సోమవారం చేపడతామని ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో తెలిపింది. ఇదిలా వుండగా నిర్భయ కేసులో బాల నేరస్థుడు ఇవాళ విడుదలవుతుండటంపై టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత స్పందించారు. ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం బాల నేరస్థుడి విడుదలను ఆపలేమన్నారు. ఇంత పెద్ద తప్పు చేసిన అతను..రేపటి నుంచి మనతో పాటూ సమాజంలో తిరుగుతాడని ఊహించుకుంటే.. భయమేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా మహిళలు కూడా ఇదే ఫీల్‌ అవుతున్నారన్నారు ఎంపీ కవిత. వివిధ కారణాలతో రాజ్యసభను జరుగకుండా అడ్డుపడుతున్న విపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన టైం వచ్చిందన్నారు. బాల నేరస్థుల వయోపరిమితి సవరణ చేసిన జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ రాజ్యసభలో ఆమోదం పోందేలా సహకరించాలన్నారు.