బాల బాలికలు తమ హక్కులపై అవగాహనను పెంపొందించుకోవాలి – ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ ఫర్ ఇండియా కోఆర్డినేటర్ గ్రేస్”
శేరిలింగంపల్లి, నవంబర్ 10( జనంసాక్షి): బాలబాలికలంతా తెలిసే తెలియని వయసులో సామాజికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారని, వారికి ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతుంటారని… అలాంటి వారంతా తమకున్న హక్కులపట్ల అవగాహనను పెంచుకోవడం ద్వారా విలువైన జీవితాన్ని పొందడానికి ఆస్కారం కలుగుతుందని ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ ఫండ్ ఇండియా కోఆర్డినేటర్ గ్రేస్ తెలిపారు. ఈమేరకు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వలిమెల గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో గురువారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు ఆమె చదువుకునే సమయంలో సామాజిక స్పృహ సరిగా లేకపోవడంవల్ల ఇంట, బయటా అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. ప్రధానంగా తమకు సమస్య ఎదురైనప్పుడు దాని పరిష్కారానికి ఎవరిని కలవాలి, ఎలాంటి హక్కుల ద్వారా దానిని మరింత సులువుగా పరిష్కరించుకోవచ్చు అనే విషయంపట్ల అవగాహనరాహిత్యంతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనడం జరుగుతుందన్నారు. ప్రత్యేకించి పేదరికంలో మగ్గే పిల్లలు, ఆడపిల్లలు అత్యవసర పరిస్థితుల్లో 1098 నెంబర్ కు కాల్ చేయడం ద్వారా పోలీసులకు ఆ సమాచారం చేరి వారిని ఆ ఇబ్బందుల నుండి గట్టు ఎక్కించే అవకాశం ఉంటుందన్నారు. ఈ వ్యవస్థలోని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగినప్పుడే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అలాంటివారు ఎలాంటి సమస్యనైనా సులువుగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారన్నారు. కళాశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా పెద్దలద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా తమకున్న హక్కులను తెలుసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సులువుగా పరిష్కరించుకోవడం సాధ్యపడుతుందన్నారు. చైల్డ్ ఫండ్ ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫెసిలిటేటర్ దీప సౌజన్యంతో ఇలా సామాజిక బాధ్యతతోకూడిన కార్యక్రమాలను నిర్వహించడం శుభపరిణామమని, మున్ముందు మరిన్ని కార్యక్రమాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని గ్రేస్, రాంప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మల్లికార్జున్, శ్రీకృష్ణ, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.