బావి తవ్వకాన్ని నిలిపివేయాలి

కలెక్టరేట్‌, జనంసాక్షి :తమ గ్రామ శివారులో చేపడుతున్న బావి తవ్వకాన్ని తక్షణమే నిలిపివేయాలని వేములవాడ మండలం లింగంపల్లి గ్రామస్తులు సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. సుమారు 300మంది కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ధర్నా ప్రదర్శన రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా లింగంపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో సుద్దాల గ్రామస్తులు తమ గ్రామ శివారులో అక్రమంగా మూడు బావులు తవ్వరని ,పట్టాభూముల నుంచి సుద్దాల గ్రామ చెరువు వరకు పైప్‌లైన్‌ వేశారని అన్నారు. మూలవాగు పట్టా భూముల నుంచి కాలువలు తీశారని పేర్కొన్నారు. ఫలితంగా తమ గ్రామశివారులో వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. ఆ బావులకు 7.5 హెచ్‌పీ విద్యుత్‌ మోటార్లు అమర్చడంతో వ్యవసాయ బావులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సుద్దాల గ్రామస్తులు లింగంపల్లి గ్రామ శివారులో తవ్వుతున్న బావిరి నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌కు వినతి పత్రం అందజేశారు.